ప్రజాశక్తి-తెనాలి : యువకుడు హత్య కేసులో గుంటూరు జిల్లా తెనాలి 11వ అదనపు జిల్లా జడ్జి బుధవారం సంచలన తీర్పును వెల్లడించారు. కేసులో ఏకంగా 13 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ప్రస్తుత బాపట్ల జిల్లా రేపల్లె మండలం అడవులదీవి పంచాయతి పరిధిలో మహమ్మదీయపట్నంలో 2016 జూలై 17న జరిగిన ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గ్రామానికి చెందిన యువతి జాస్మిన్, అడవులదీవికి చెందిన షణ్ముఖ శ్రీసాయి అప్పట్లో ప్రేమికులు. వారి ప్రేమను జాస్మిన్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. యువతికి మరో వ్యక్తితో వివాహం చేసేందుకు సన్నాహాలు చేశారు. ఈ క్రమంలో జాస్మిన్ తల్లి దండ్రులు ఓ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు చినమట్లపూడి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరనే సమాచారాన్ని సాయికి జాస్మిన్ ఫోన్ ద్వారా తెలిపింది. శ్రీసాయి తన మిత్రుడు పవన్‌తో కలిసి జాస్మిన్ ఇంటికి వెళ్లారు. అయితే జాస్మిన్ ఇంట్లోకి ఇద్దరు యువకులు వెళ్లడాన్ని ఇంటి ఎదురుగా ఉన్న మరో వ్యక్తి అయిన బాషా గమనించి జాస్మిన్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. దీంతో జాస్మిన్‌ను ఆమె తల్లిదండ్రులు ఫోన్‌లోనే నిందించారు. అదే సమయంలో బాషా తలుపుకొట్టడంతో భయపడిన జాస్మిన్, సాయి, పవన్‌లను దొడ్డి దారినే జాస్మిన్ బయటకు పంపిచేసింది. వారు వెళ్లిన కొద్ది సేపటికే తాను చనిపోతున్నానంటూ శ్రీసాయికి ఫోన్ చేసింది. కంగారు పడిన శ్రీసాయి తన మిత్రడు పవన్‌తో కలిసి క్షణాల్లో అక్కడకు చేరుకున్నాడు. వారు చేరుకునేలోగానే జాస్మిన్ ఉరేసుకుంది. ఈలోగా అక్కడి చేరుకున్న జాస్మిన్ తల్లిదండ్రులకు ఆమె మృతికి శ్రీసాయి, పవన్ కారణమంటూ బాషా చెప్పటంతో వారితో పాటు గ్రామస్తులు ఆగ్రహించారు. శ్రీసాయి, పవన్‌ను సమీపంలోని ఉర్దూ పాఠశాల వద్ద చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. కనీసం తాగేందుకు నీరు కూడా ఇవ్వకుండా పాశవికంగా వ్యవహరించారు. గాయాలపై కారం చల్లటం, ముఖంపై మూత్రం పోయటం వంటి జుగుప్సాకరమైన చర్యలకు పాల్పడ్డారు. వారి దాడికి తట్టుకోలేని షణ్ముఖశ్రీసాయి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో మొత్తం 21 మందిని నిందితులుగా చేర్చారు. విచారణ సమయంలో నలుగురు మృతి చెందారు. తెనాలి జిల్లా కోర్టులో సాక్ష్యాదారాలను పరిశీలించి, వాదోపవాదాలు ముగిసిన పిదప 11వ అదనపుజిల్లా జడ్జి జి.మాలతి తీర్పు నిచ్చారు. నలుగురు మహిళలపై కేసును కొట్టివేశారు. మిగిలిన 13 మంది షేక్ షాహిదుల్లా, షేక్ ఆసిఫ్, షేక్ నాగూర్‌బాషా, షేక్ ఫజల్, షేక్ ఖాదర్, షేక్ మహ్మద్ బాజి, షేక్ మౌలాలి, షేక్ ఖలాలుల్లా, షేక్ మీరా, షేక్ నూరుల్లా, షేక్ బుడా, షేక్ జుబీర్, షేక్ జైనుల్లాకి యావజ్జీవ కారాగార శిక్ష విదించారు. తీర్పుపై మృతుని తల్లి ప్రియదర్శిని హర్షం వ్యక్తం చేశారు. శిక్ష నుంచి మినహాయింపు పొందిన నలుగురు మహిళలు చాలా పాశవికంగా వ్యవహరించారని, వారికి కూడా శిక్ష విధించాలని కోరుతూ అప్పీలుకు వెళ్లనున్నట్లు ఆమె తెలిపారు. ప్రాసిక్యూషన్ తరఫున ఎపిపి డి.మోహన్‌రెడ్డి వాదించగా, ప్రాసిక్యూషన్ అసిస్టెంట్‌గా మారౌతు సాంబశివరావు పనిచేశారు.










