Sep 19,2022 23:45

వివరాలు వెల్లడిస్తున్న క్రైమ్‌ డిసిపి నాగన్న

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : విశాఖ నగర పరిధి గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో 2022 జులై 26, సెప్టెంబర్‌ 17, 18 తేదీల్లో జరిగిన రెండు హత్యలు, ఒక హత్యాయత్నం కేసులను ఛేదించామని క్రైమ్‌ డిసిపి జి.నాగన్న తెలిపారు. సోమవారం సాయంత్రం విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుల వివరాలను మీడియాకు వివరించారు.
గాజువాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2022 జులై 26న జింక్‌ ఫ్యాక్టరీ పక్కన పొదల్లో లభించిన మృతదేహంపై విచారణలో మృతుడు సిద్ధార్థ శంకర్‌ పట్నాయక్‌ (40)గా గుర్తించినట్లు తెలిపారు. అతని సహోద్యోగి పాండా జితేంద్ర ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయగా యడ్ల గౌరీశంకర్‌ (20), యడ్ల ఈశ్వరమ్మ (42), ఆ కుటుంబానికే చెందిన జువైనల్‌ ముగ్గురు కలిసి సిద్ధార్థ శంకర్‌ పట్నాయక్‌ను హత్య చేసినట్లు తేలిందన్నారు. నిందితులు ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులకు మృతుడు రూ.12 లక్షలు బాకీ ఉన్నాడని, అతనిని డబ్బులు అడగ్గా ఇవ్వడంలేదని తెలిపారు. యడ్ల ఈశ్వరమ్మతో మృతునికి ఉన్న వివాహేతర సంబంధాన్ని ఆసరాగా తీసుకొని అసభ్యకర రీతిలో కించపరచడంతో కోపోద్రికులైన ఆమె పిల్లలు సిద్ధార్థ శంకర్‌ పట్నాయక్‌ను హత్య చేశారని వివరించారు.
మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2022 సెప్టెంబర్‌ 18న జరిగిన మరొక హత్య కేసులో ప్రధాన నిందితులు మూలంపాక ఉదరుకుమార్‌ (27), అందిపోయిన ప్రసాద్‌ (32)తో పాటు అతనికి సహకరించిన మరో ఆరుగురిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. సెప్టెంబర్‌ 18వ తేదీ రాత్రి మల్కాపురంలో గ్రామ అమ్మవారి ఉత్సవ సందర్భంగా ఉదరు కుమార్‌, ప్రసాద్‌లు హేమంత్‌ కుమార్‌తో ఘర్షణ పడ్డారని చెప్పారు. హేమంత్‌కుమార్‌పై కత్తులతో దాడి చేసి హత్య చేశారని తెలిపారు. మృతునిపై రౌడీ షీట్‌ ఉందని, ప్రధాన నిందితుడు ఓలంపాక ఉదరు కుమార్‌పై మల్కాపురం స్టేషన్‌లో సస్పెక్ట్‌ షీట్‌ ఉందని వివరించారు.
మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డాల్ఫిన్‌ హిల్స్‌ గేటు వద్ద 2022 సెప్టెంబర్‌ 17 రాత్రి జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసామని తెలిపారు. కారం చల్లి ఇనుపరాడ్‌, చిన్న కత్తితో యారాడ గ్రామం గంట్యాడకు చెందిన మొల్లి శ్రీను దాడి చేశారని మొల్లి తాతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టినట్లు చెప్పారు. విచారణ అనంతరం మొల్లి శ్రీనును అరెస్ట్‌ చేశామని తెలిపారు. వివాహేతర సంబంధం ఈ హత్యాయత్నానికి కారణమని వివరించారు. ఈ సమావేశంలో ఎడిసిపి సూర్య శ్రవణ్‌ కుమార్‌, డిసిపి లా అండ్‌ ఆర్డర్‌ గంగాధరం, మల్కాపురం ఇన్‌స్పెక్టర్‌ బి.లూధర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.