Sep 12,2023 20:55

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్‌పి

హత్య కేసు నిందితులు అరెస్టు : ఎస్‌పి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     పెద్దకొట్టాల గ్రామానికి చెందిన సిందే నర్సోజీ హత్య కేసులో 7 మంది నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరు పరిచి ఎస్‌పి వివరాలను వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 4న పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన సిందే నర్సోజీని అదే గ్రామం ఊరిబయట ఇటుకల బట్టీల వద్ద తన భార్య సిందే జయశ్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్న కుమారి రవీంద్ర, అతని స్నేహితులు కలిసి తలపై నరికి చంపారని మృతుడి తల్లి సిందే రామ్‌ బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నంద్యాల తాలూకా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అతని భార్యనే హత్య చేయించినట్లు తేలిందన్నారు. నిందితులు కుమారి.రవీంద్ర, గుండపోగుల రాజేశ్‌ ఏ బొంగు, కాలె వెంకట రమణ, నక్క చిన్న నరసింహుడు ఏ బుజ్జి గాడు, నల్లబోతుల వెంకటేశ్వేర్లు, జజ్జం నాగేంద్ర సింధే జయశ్రీలను చాబోలు రోడ్డులో గల న్యూ వెంకటేశ్వర సీడ్స్‌ ఎదురుగా గల పాత ఇటుకల బట్టి రేకుల షెడ్ల వద్ద అరెస్టు చేశారన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరచిన తాలూకా పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ జీ.వెంకట రాముడు, డీఎస్పీ మహేశ్వర్‌ రెడ్డి, తాలూకా సీఐ ఎం.దస్తగిరి బాబు, ఎస్‌ఐలు నాగరాజు, రామ మోహన్‌ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ నెల చివరి వరకు 30 యాక్టు అమలులో : మాజీ సిఎం చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో జిల్లాలో ఈ నెల చివరి వరకు 30 యాక్ట్‌ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో 30 యాక్ట్‌ ఎన్ని రోజులు అమలులో ఉండబోతుందని అడిగిన ప్రశ్నకు ఎస్‌పి సమాధానమిచ్చారు. అనుమతి లేకుండా ర్యాలీలు, నిరసనలు చేపట్టరాదని చెప్పారు. ఏదైనా కార్యక్రమం చేయాలంటే పోలీసుల అనుమతి తప్పని సరిగా తీసుకోవాలన్నారు. 30 యాక్ట్‌ ఉన్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బంద్‌ సందర్బంగా 40 మందిపై కేసులు నమోదు చేశామని, 390 మందిని అరెస్టులు చేసినట్లు తెలిపారు.
పుట్‌పాత్‌లను ఆక్రమిస్తే చర్యలు : నంద్యాల పట్టణంలో పుట్‌పాత్‌లను ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్‌పి హెచ్చరించారు. ఇప్పటికే పెట్టుకున్న షాపులను ఖాళీ చేయించామని తెలిపారు. అయినప్పటికీ మళ్లీ ఆక్రమించుకున్నా రని పుట్‌ పాత్‌లపై పాదచారులు తిరగడానికి వీలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. మున్సిపాలిటీ, పోలీసులు కలిసి పుట్‌ పాత్‌లు ఆక్రమించుకున్న వారికీ ఫొటోలు తీసి నోటీసులు ఇస్తామన్నారు. రెండు, మూడు రోజులు సమయం ఇచ్చి తొలగిస్తామన్నారు.