కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
పిఠాపురం రూరల్ విరవాడలో 2012లో పట్టపగలు రాజకీయ కారణాలతో జరిగిన జంట హత్య కేసులో సాక్షాధారాలు బలంగా ఉన్నప్పటికీ కేసును కొట్టివేయడంతో ఆగ్రహించిన మతుల బంధువులు బుధవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కొందరు శరీరంపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ డిఎస్‌పి మురళీకృష్ణారెడ్డి నచ్చజెప్పడంతో కొంత సేపటికి పరిస్థితులు సద్దుమణిగాయి. అడపా భీమరాజుర, పెదిరెడ్ల వెంకటేశ్వరరావు నాటి ఘటనలో హత్యకు గురైన విషయం విదితమే.
ఈ సందర్భంగా అడపా భీమరాజు కుమారుడు, ఎంపిటిసి సభ్యులు అడపా రఘు, పెదిరెడ్ల వేంకటేశ్వరరావు భార్య అచ్చివేణి తదితరులు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. 2012 జూన్ 10న అప్పటి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమరాజును రాజకీయ వైరుధ్యాలు ఉన్న నేపథ్యంలో దారి కాసి హతమార్చడానికి ప్రయత్నించారు. అడ్డుకోబోయిన పెద్దిరెడ్ల వెంకటేశ్వరరావును, పోతుల వీరభద్రరావుపై అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారన్నారు. ఈ దాడిలో అడపా భీమరాజుతోపాటు పెద్దిరెడ్ల వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మరణించారన్నారు. పోతుల వీరభద్రరావు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి ప్రాణాలతో బయటపడ్డారన్నారు. ఈ కేసును న్యాయమూర్తి కొట్టివేశారన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న కురాకుల పుల్లయ్య కేసు కొట్టివేసిన తర్వాత సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడంతో మృతుని బంధువులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయాల పాలైన ప్రత్యక్ష సాక్షి పోతుల వీరభద్రరావు సాక్ష్యం చెప్పినా కేసు కొట్టి వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు శిక్ష పడేలా చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.










