Oct 12,2023 21:10

హత్య.. ఆత్మహత్యా.. తేల్చరే..!
బాలిక కేసులో కొనసాగుతున్న విచారణ
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌

జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపిన బాలిక హత్య కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. గత నెల 17వ తేదీ 16 సంవత్సరాల బాలిక భవ్యశ్రీ కనిపించడం లేదంటూ పెనుమూరు పోలీసు స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 29వ తేదీ అదే మండలం ఎగువచెరువు సమీపంలోని భూపాల్‌రెడ్డి వ్యవసాయ బావిలో భవ్యశ్రీ శవమై కనిపించింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసును ఆత్యాచారం, హత్య కేసులుగా పెనుమూరు పోలీసులు రిజిస్టర్‌ చేశారు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని భవ్యశ్రీ కేసు మిస్టరీలో ఈ యువకుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేసి ఆ నలుగురు యువకులకు ప్రమేయం లేదని గట్టిగా వాధిస్తున్నారు.
గతనెల 17వ తేదీ నుండీ నేటి వరకు పోలీసులు భవ్యశ్రీది హత్యా.. ఆత్మహత్యా.. తేల్చలేకపోతున్నారు. ఇంత కంటే పెద్దపెద్ద కేసులను గంటల వ్యవధిలో చేధించిన పోలీసులు బాలిక మృతికేసులో ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారా... అనేది పలు అనుమానాలకు తావిస్తోంది.
కొనసాగుతున్న విచారణ..
గత నెల 20వ తేదీ వ్యవసాయ బావిలో నుంచి బాలిక భవ్యశ్రీ మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అత్యాచారం జరిగిందా.. లేదా...? మృతురాలి వెంట్రుకలు (కుచ్చు)గా ఎందుకు ఊడిపోయాయి...? ఒంటిపై ఏవైనా గాయాలు ఉన్నాయా...? లోదుస్తులు ఎందుకు లేదు. వెంట్రుకలు ఊడి మృతురాలి తల గుండుగా ఎందుకు మారింది. ? కనుగుడ్లు పీకేసిన్నట్లు ఎందుకు ఉబ్బుగా ఉన్నాయి...? ఇవీ భవ్యశ్రీ మృతిపై వ్యక్తమవుతున్న అనుమానాలు. ఈ ప్రశ్నలన్నింటికీ పోస్టమార్టం రిపోర్ట్‌ వచ్చేంత వరకు ఆగాల్సిందేనంటు గురువారం వరకు పోలీసులు సమాచారం చెప్పలేదు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి గురువారం ప్రెస్‌మిట్‌ పెట్టి బాలిక భవ్యశ్రీ కేసు వివిధ కోణాలు విచారించడంతో పాటు రిపోర్టుల ఆధారంగా అత్యాచారం జరగలేదని, వెంట్రుకలు ఊడిపోవడం, కనుగుడ్లు ఉబ్బడానికి గల కారణం నీటిలో మూడు రోజులు పాటు ఉండటమేనని రిపోర్టుల ఆధారంగా తేల్చారు. ఎక్కడైనా చంపి బావిలో పడేశారా అనే విషయానికి వస్తే ఎలాంటి ఆధారాలు లేవని, అలాగే బాలిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందా... ఎవ్వరైనా బలవంతంగా బావిలో పడేశారా అనే విషయాలను తేల్చేందుకు మరింత సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు విచారణ చిత్తూరు డిఎస్‌పి శ్రీనివాసమూర్తి, దిశ సిఐ బాలయ్య నేతృత్వంలో కొనసాగుతోంది.
హత్యా... ఆత్మహత్యా..?
బాలిక భవ్యశ్రీది ముమ్మాటికీ హత్యే అంటూ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, దళిత సంఘాలు కలెక్టరేట్‌ ముట్టడికి పూనుకున్నాయి. బీసి కులానికి చెందిన బాలికను అత్యాచారం చేసి హత్యచేస్తే ప్రభుత్వం, పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తున్నాయంటూ తీవ్రఆరోపణలు చేశాయి. సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ముట్టడిన భగం చేసేందుకు పోలీసులు శతవిధాలుగా ప్రయత్నం చేసి విఫలమయ్యారు. గతనెల 20వ తేదీ బాలిక శవం వ్యవసాయబావిలో కనిపిస్తే నేటి వరకు అంటే ఈనెల 12వ తేది వరకు హత్య, ఆత్మహత్య అని తేల్చలేకకపోవడంపై ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, బీసి, దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెనుమూరులో చోటు చేసుకున్న బాలిక భవ్యశ్రీ కేసును చేధించేందుకు ఇంకెంత సమయం కావాలంటూ ప్రశ్నిస్తున్నారు.