Aug 03,2021 17:40

వాషింగ్టన్‌ : భారత్‌తో కుదుర్చుకున్న అణ్వాయుధ ఒప్పందాన్ని అమెరికా అమలుపరిచింది. హర్పూన్‌ జాయింట్‌ కామన్‌ టెస్ట్‌ సెట్‌ (జెసిటిఎస్‌)తో పాటు సంబంధిత పరికరాలను 82 మిలియన్‌ డాలర్ల అంచనా వ్యయంతో భారత్‌కు విక్రయించేందుకు ఒక ఒప్పందం కుదిరింది. ఇండో -పసిఫిక్‌ ప్రాంతంలో భద్రతను మెరుగుపరచడంతో పాటు వ్యూహాత్మక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ ఒప్పందం సహకారం అందించనుంది. హార్పూన్‌ ఒక యాంటీషిప్‌ మిసైల్‌. ఈ విక్రయాన్ని అమెరికా కాంగ్రెస్‌ ధృవీకరించిందని పెంటగాన్‌ డిఫెన్స్‌ సెక్యూరిటీ కార్పోరేషన్‌ ఏజన్సీ (డిఎస్‌సిఎ) ఒక ప్రకటనలో తెలిపింది. ఒక జెసిటిఎస్‌ను విక్రయించాల్సిందిగా భారత ప్రభుత్వం కోరిందని ఈ ప్రకటన తెలిపింది. వీటితో పాటు హర్పూన్‌ ఇంటర్మీడియెట్‌ లెవల్‌ మెయింట్‌నెన్స్‌ స్టేషన్‌, విడిభాగాలు, మరమ్మత్తు పరికరాలు, పరీక్ష పరికరాలు, సాంకేతికతకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌, సిబ్బంది, శిక్షణ, ఇతర అంశాలకు సంబంధించి మొత్తం 82 మిలియన్‌ డాలర్లుగా అంచనా వేసినట్లు వెల్లడించింది. 2016 జూన్‌లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా.. భారత్‌ను మేజర్‌ డిఫెన్స్‌ పార్టనర్‌గా అమెరికా గుర్తించింది. ప్రతిపాదిత విదేశీ ఆయుధ విక్రయంతో .. భారత్‌ సామర్థ్యం మరింత బలోపేతం కానుందని స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, ప్రపంచంలోనే విజయవంతమైన యాంటి షిప్‌ మిసైల్‌ అయిన హార్పూన్‌ మిసైల్‌, రక్షణ విభాగం 30 దేశాలకు పైగా సేవలు అందిస్తున్నట్లు యుఎస్‌ డిఫెన్స్‌ మేజర్‌ తెలిపింది.