Feb 13,2022 11:53

అడుగడుగునా వైవిధ్యంతో రమణీయత చాటే సుందర దృశ్యాల కొలువు ఈ ప్రకృతి. హృదయ స్పందనతో మనసు మీటే మొక్కలు ప్రకృతి వరాలు. మనసు పెట్టిచూడాలేగానీ, విచ్చుకునే ప్రతీ ఆకులోనూ అందం.. విరిసే ప్రతీ పువ్వులోనూ ఏదో మకరందం.. పెరిగే ప్రతీ మొక్కా నయనానందాన్ని ఇస్తాయి. స్పందించే గుండెలాగా, నినదించే హృదయంలా.. ప్రేమించే మనసులా.. ఒక అభిలాషలా.. ఒక ఆకాంక్షలా... కొలువుదీరి మైమరపించే ఆ అపురూప ముగ్ధ మనోహర విరుల గురించి ప్రేమికుల కోసం ప్రత్యేకంగా..

ప్రేమికుల రోజున కొందరు మొక్కలను, పువ్వులను కానుకలుగా ఇచ్చిపుచ్చుకోవడం పరిపాటిగా మారింది. పర్యావరణాన్ని పరిరక్షించే అటువంటి కొన్ని మొక్కల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం.

                                                                   హృదయ పువ్వులు..

 హృదయ పువ్వులు..

ఆకుపచ్చని మొక్క కొమ్మకు లేత గులాబీరంగులో ముచ్చటగొలిపే హృదయాకారపు పువ్వులు మనసు నిండుగా వికసిస్తాయి. అందుకే వీటిని ప్రపంచ అపురూపాలని పిలుస్తారు. లాంప్రోకాప్నోస్‌ స్పెక్టాబిలిస్‌, బ్లీడింగ్‌ హార్ట్‌, ఫెలోపియన్‌ బడ్స్‌, ఆసియన్‌ బ్లీడింగ్‌-హార్ట్‌ అనేపేర్లు కూడా వీటికి ఉన్నాయి. సైబీరియా, ఉత్తర చైనా, కొరియా, జపాన్‌కు చెందిన పాపావెరేసియే కుటుంబానికి చెందిన పుష్పించే మొక్కలు ఇవి. అరుదుగా ఇవి తెలుపు రంగులోనూ ఉంటాయి. మొక్క రెండు నుంచి మూడడుగుల వరకూ పెరుగుతుంది. వసంత కాలంలో పువ్వులు పూస్తుంది. ఈ మొక్క పెరగడానికి ఎండ అవసరం. మూడురోజులకోసారి నీళ్లు పోస్తే సరిపోతుంది.

                                                                  ఆకట్టుకునే పండ్లు..

ఆకట్టుకునే పండ్లు..

పనస, పుచ్చకాయ వంటి కొన్ని రకాల పండ్లు హృదయాకారంలో కాసి, ఆకట్టుకుంటాయి. పనస అరుదుగా కాసినా.. పుచ్చకాయల్లో ఈ తరహా కాయలు కాసేవి ఒకరకం ఉన్నాయి. అమెరికాలో ఇసుక తెన్నుల్లో వీటిని ఎక్కువ సాగు చేస్తారు.

                                                               ఎచేవేరియా రన్యోని రోజ్‌..

ఎచేవేరియా రన్యోని రోజ్‌..

ఇది నిజానికి సకులెంట్‌ జాతికి చెందిన మొక్కే. మొవ్వు మధ్యలోంచి రెండు దూటలు వస్తాయి. అవి రెండూ కలిపి హృదయాకారంగా వంగుతాయి. వాటికి కలువ మొగ్గలాంటి చిన్న చిన్న పువ్వులు దూటల నిండా విచ్చుకుంటాయి. పువ్వులు లేత గులాబీ, వెండి రంగుల రేకలతో ఎంతో అందంగా ఉంటాయి. దళసరిగా ఉండే పూ రేకల్లో, వాటి కాండాల్లో జెల్‌ వంటి ద్రవం ఉంటుంది. దీనికి తక్కువ నీటి వనరు అవసరం. మొక్కల మొదట నీరు నిలువ ఉంటే కుళ్ళిపోతాయి. వాడిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. ఇవి పొడి నేలలో బాగా పెరుగుతాయి. వర్షాకాలం తప్ప అన్ని సీజన్లలో పువ్వులు పూస్తాయి. ఇది ఎండలోనే పెరుగుతుంది.

                                                                కోలోకసియా ఎస్కలెంట్‌..

కోలోకసియా ఎస్కలెంట్‌..

హృదయాకారపు ఆకులతో అలరించే ఇండోర్‌ మొక్క కోలోకసియా ఎస్కలెంట్‌. ఆకులు దళసరిగా, గట్టిగా, మెరుస్తూ ఉంటాయి. నల్లని రంగులో ఉండటంతో దీన్ని విదేశాల్లో 'డార్క్‌ క్వీన్‌' అంటారు. ప్రకృతిలో నలుపురంగు ఆకులుండే మొక్కలు చాలా అరుదుగా ఉంటాయి. అందులో ఇదొకటి. ఆకుల మీద నీళ్లు చిలకరిస్తే వెంటనే జారిపోతాయి. ఒక్కో ఆకు ఏడాది వరకూ ఉంటుంది. ఈ మొక్క నెమ్మదిగా ఎదుగుతుంది. కొబ్బరి పొట్టులో బాగా పెరుగుతుంది.

                                                                  బ్లీడింగ్‌ హార్ట్‌ కాక్టస్‌..

 బ్లీడింగ్‌ హార్ట్‌ కాక్టస్‌..

ఎర్రని హృదయం రక్తాన్ని చిందు తున్నట్టుగా ఉండేది బ్లీడింగ్‌ హార్ట్‌ కాక్టస్‌. ఇది ఎడారి జాతి మొక్క. దీనికి పెద్దగా నీటి అవసరం లేదు. ఇసుక, రాళ్ల నేలల్లోనూ పెరుగుతుంది. ఇది పూర్తిగా ఔట్‌ డోర్‌ మొక్క. ఆకులే దీని ఫెటల్స్‌. తొలుత గుండ్రంగాను, ముదిరేకొలదీ హృదయాకారంలోకి వస్తాయి.

                                                                  మొంస్టెరా దుబియా..

మొంస్టెరా దుబియా..

లతలు మాదిరిగా తీగలు తిరిగి, ఆకుపచ్చని పత్రాలతో అందంగా అల్లుకొని, పాదు మాదిరిగా పెరిగే విశిష్టమైన మొక్క మొంస్టెరా దుబియా. ఐరోపా దేశాల్లో ఈ మొక్కను పార్కుల్లో ముఖ్యంగా హృదయ ఆకారాల్లోకి మళ్ళించి, పెంచుతారు. మొక్క సంవత్సరం పొడుగునా నయనానందాన్ని ఇస్తుంది. ఇది ఎలాంటి నేలలోనైనా పెరుగుతుంది. దీనికి నీటి వనరు అవసరం ఎక్కువ.

                                                            సైప్రిపీడియం ఆక్యూల్‌ ఐటన్‌..

  సైప్రిపీడియం ఆక్యూల్‌ ఐటన్‌..

లేత గులాబీ, తెలుపు రంగుల కలబోతతో పువ్వు అచ్చంగా పిడికెడు గుండెలానే ఉంటుంది. పువ్వు రేక కూడా ముక్‌మల్‌ వస్త్రంలా దళసరిగా, మెత్తగా ఉంటుంది. దాదాపు అడుగు ఎత్తు వరకూ ఈ మొక్క పెరుగుతుంది. మొక్క మధ్యలోంచి సన్నని దూట వచ్చి, దానికి ఈ పువ్వులు పూస్తాయి. ఇవి ఆర్చిడ్‌ జాతికి చెందిన మొక్కలు. మే నెల నుంచి జులై వరకూ పువ్వులు పూస్తాయి. ఇండోర్‌, షెమీ షేడ్‌లోనూ వీటిని పెంచుకోవచ్చు. నీటి వనరు చాలా తక్కువ అవసరం. బొగ్గు, కొబ్బరి పొట్టు మిశ్రమంలో మొక్క బాగా పెరుగుతుంది. పువ్వులు కోసిన నాలుగైదు రోజుల వరకూ నిలువ ఉంటుంది. అమెరికా, కెనడా దేశాలు వీటికి పుట్టినిల్లు.

                                                           ఫినెస్త్రరియా రహోపజోఫీల్లా..

    ఫినెస్త్రరియా రహోపజోఫీల్లా..

ఈ మొక్క కాండమే ఆకుపచ్చని హృదయాకారంగా ఉంటుంది. దీనికి ఆకులు, కొమ్మలు ఉండవు. రెండు నుంచి ఆరు అంగుళాలు పొడవు వరకూ ఇది పెరుగుతుంది. వీటి మధ్యలోంచి పసుపు, ఎరుపురంగులతో సన్నగా విచ్చుకునే పూరేకలు మరింత శోభను అద్దుతాయి. ఇది సకులెంట్‌ జాతికి చెందిన మొక్క. దీనికి పెద్దగా నీటి వనరు అవసరం ఉండదు. ఇది ఎండలోనే పెరుగుతుంది. మొక్కను చిదిమితే లోపల జెల్‌ వంటి ద్రవం ఉంటుంది. ఇసుక, ఎరుపు, నల్లరేగడి మట్టిలోను, కొబ్బరి పొట్టు మిశ్రమంలోనూ వీటిని పెంచవచ్చు.

చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506