Feb 14,2021 12:40

  హృదయాల ఆత్మీయ స్పందన ప్రేమ. ప్రకృతి మనకందించిన సుకుమార నేస్తాలు పూలు. ఎదలో ప్రేమ ఉప్పొంగే వేళ మనసుల్ని మైమరిపించడానికి పూలకంటే అపురూప కానుకలేముంటాయి. సుతిమెత్తని పూలు సుందర రూపాల్లో సుగంధ పరిమళాలు వెదజల్లుతూ అనురాగ మాలికలై, ఆప్త హృదయాలను అల్లుకుపోతాయి. లోకమంతా ప్రేమకు పూలే నజరానా.
   రెపరెపలాడే మొక్కల్లా తమ అనురాగం కలకాలం వర్ధిల్లాలని పూలే కాకుండా మొక్కలను ప్రేమికులు ఇచ్చిపుచ్చుకోవడం కొత్త ఒరవడిగా మారుతోంది. హృదయాకార పువ్వులు పూసే పలురకాల మొక్కలకి డిమాండ్‌ పెరుగుతోంది. అలాంటి కొన్ని మొక్కల పరిచయం మీకోసం..
 

                                                           ప్రణయ పుష్పం గులాబీ

ప్రణయ పుష్పం గులాబీ

  పూల ప్రపంచంలో రాణిపువ్వు ఏదైనా ఉంది అంటే.. నిస్సందేహంగా అది గులాబీనే. దానిని ప్రణయ కుసుమమని మరో పేరుతోనూ పిలుస్తుంటారు. ముఖ్యంగా హైబ్రీడ్‌ గులాబీ మొగ్గలు ప్రేమికుల దినోత్సవ వేళ హల్‌చల్‌ చేస్తుంటాయి. ఇప్పుడంటే ఎన్నో మాద్యమాలు వచ్చేశాయి. కానీ ఒకప్పుడు ప్రేమికులను కలిపే వారథులు, ప్రేమను తెలిపే సారథులు ఈ రోజా పూలే.
 

                                                        హృదయ విందం ఆంథోరియం

 హృదయ విందం ఆంథోరియం

    హృదయాకారంలో విచ్చుకునే పువ్వులు ఆంథోరియంలు. ఈ పువ్వుకి మధ్యలో ఉండే పుప్పొడి మరింత అందాన్ని ఇస్తుంది. ఒక్కో పువ్వు 15 రోజుల నుంచి నెల రోజులు నిగారింపుగా ఉంటాయి. ఈ రకం పువ్వులు ఎక్కువగా గులాబీ రంగులో ఉంటాయి. ఇటీవల మల్టీకలర్‌ డిజైన్లతో కూడా పువ్వులు పూసే మొక్కలు వస్తున్నాయి. ఇది తేలికపాటి కుండీల్లో ఇళ్లలోనే పెంచుకునే మొక్క. అందుకే హృదయాల పండగ రోజున ఈ మొక్కలే ఎక్కువగా కానుకలౌతున్నాయి.

                                                             డార్లింగ్‌ డాలియా

 డార్లింగ్‌ డాలియా

   శీతాకాలం పూసే సీజనల్‌ పూలు డాలియాల్లో ఒక రకం డార్లింగ్‌ డాలియా. మామూలు డాలియాలు గుండ్రంగా ఉంటాయి. డార్లింగ్‌ డాలియాలు మాత్రం హృదయాకారంగా ఉంటాయి. వీటిలో చాలా రకాలు ఉంటాయి.

                                                             

                                                               ప్రేమ'హోయా'

ప్రేమ'హోయా'

    కొమ్మా, రెమ్మా, ఆకు, పువ్వూ అన్నీ హృదయాకారమై ప్రేమికులకు స్వాగతం పలికే అరుదైన మొక్క హోయా. కాక్టస్‌ జాతికి చెందిన దళసరి పాటి ఆకులాగ, ప్లాస్టిక్‌ వస్తువులా ఉండే గమ్మత్తైన మొక్క ఇది. చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఏ వాతావరణంలోనైనా చక్కగా ఉంటుంది.


                                                             ఎదలోతులు హార్ట్‌ ఆర్కిడ్స్‌

 ఎదలోతులు హార్ట్‌ ఆర్కిడ్స్‌

   ఇండోర్‌లో పెరిగే ఆర్కిడ్స్‌ పూల మొక్కల్లో రకరకాల పువ్వులు పూసేవి ఉన్నాయి. హార్ట్‌ ఆర్కిడ్స్‌ మాత్రం వేరైటీగా ఉంటాయి. పువ్వులు హృదయాకారంగా ఉండి, కాగితం పొట్లం చుట్టినట్టుగా మధ్యలో గుల్లగా ఉంటాయి. లేత వంకాయి రంగులో పువ్వు నాజూగ్గా ఉంటుంది.
 

                                                                   లవ్లీ లిల్లీ

లవ్లీ లిల్లీ

   హృదయాకారంగా ఉండే ముదురు పింక్‌ రంగు పూలు కొత్తరకం పూలలా ఉంటాయి. మధ్యలో మన్మథ బాణంలాంటి పుప్పొడి సువాసనలు గుప్పిస్తాయి. వీటికి నీటి వనరు ఎక్కువ అవసరం. థాయిలాండ్‌లో ప్రేమికుల రోజున యువతీ, యువకుల చేతుల్లో ఎక్కడ చూసినా ఈ మొక్కలే కనిపిస్తాయి.

                                                     ప్రేమ ద్వారాలు

    కడియం విరివన మందిరాలకు హృదయాకార పూల ప్రేమద్వారాలు భలే శోభనిస్తాయి. భోగన్విలియా మొక్కలను కుండీల్లో ఈ ఆకారంలో మలచి పెంచుతారు. రంగు రంగుల పూలతో ఈ ద్వారం కనువిందు చేస్తుంది.

                                             మనసులు పల్లవించే పూలసీమ

    ప్రేమికులు దినోత్సవ వేళ కడియం నర్సరీలు కళకళలాడుతుంటాయి. సందర్శకులకు ఆత్మీయభావంతో అలరించేందుకు నర్సరీల్లో అడుగడుగునా మొక్కలతో ప్రత్యేక అలంకరణలు దర్శనమిస్తాయి.


- చిలుకూరి శ్రీనివాసరావు,
8985945506