Dec 09,2022 23:51

లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకుంటున్న గవాస్కర్‌

ప్రముఖ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ రోటరీ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు
ప్రజాశక్తి- మధురవాడ :
హృద్రోగంతో పుట్టిన పిల్లలకు రోటరీ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలు చేయడం అభినందనీయమని ఇండియన్‌ మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సునీల్‌ గవాస్కర్‌ అన్నారు. గుండె సంబంధిత సమస్యలతో పుట్టిన పిల్లలకు ఆపరేషన్లు చేయించి, వారికి సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రసాదించిన ప్రాణదాతలుగా రోటరీక్లబ్‌ ఇంటర్నేషనల్‌, రాయపూర్‌ శ్రీసత్యసాయి సంజీవని ఆసుపత్రి నిలుస్తారని సునీల్‌ గవాస్కర్‌ కొనియాడారు. సాగర్‌నగర్‌ రాడిసన్‌ బ్లూలో రోటరీక్లబ్‌ ఇంటర్నేషనల్‌ 'విశాఖ విస్తా' పేరుతో నిర్వహించిన మూడు రోజుల కార్యక్రమంలో మాట్లాడుతూ, శ్రీసత్యసాయి సంజీవని ఆసుపత్రి లో దాదాపు 2025 మంది హృద్రోగంతో పుట్టిన పిల్లలకు రోటరీక్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించి, చిన్నారులకు ప్రాణదానం చేయడం విశేషమన్నారు. పై ఆసుపత్రిలో ఓన్లో దిల్‌ ..నోబిల్‌ అని చమత్కరించారు. ఆపరేషన్‌ అనంతరం చిన్నారుల తల్లిదండ్రుల ముఖంలో కనిపించే ఆనందం డబుల్‌ సెంచరీ కొట్టిన దాన్ని మించిపోతుందన్నారు. తాను, తన కుటుంబం 50 ఏళ్లుగా శ్రీసత్యసాయి భక్తులుగా ఉన్నామని, తన ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ సక్సెస్‌ ఫుల్‌ క్రికెటర్‌గా, సెకండ్‌ ఇన్నింగ్స్‌ కామెంటేటర్‌గా విజయవంతమైందని, థర్డ్‌ ఇన్నింగ్స్‌ను హృద్రోగ పిల్లలకు సాయం చేయడం ద్వారా దిగ్విజయం సాధించినట్లుగా భావిస్తానన్నారు. రోటరీక్లబ్‌తో తన అనుబంధం జీవితాంతం వుంటుందన్నారు. ఈసందర్భంగా రోటరీ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును సునీల్‌ గవాస్కర్‌కు రోటరీక్లబ్‌ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ జెనీఫర్‌ జోన్స్‌, రోటరీ ఇనిస్టిట్యూట్‌ ఛైర్మన్‌ కిషోర్‌ కుమార్‌ చెరుకుమిల్లి, రోటరీ ఇంటర్నేషనల్‌ డైరక్టర్‌ మహేష్‌ కొటబాగి అందజేసారు. ఈసందర్భంగా సునీల్‌ గవాస్కర్‌ సంతకం పెట్టిన క్రికెట్‌ బ్యాట్‌ను వేలంలో రోటరీ పవన్‌అగర్వాల్‌ దక్కించుకున్నారు. మరో ముఖ్యఅతిధి పద్మభూషణ్‌ రఘునాథ ముసిల్కర్‌ మాట్లాడుతూ రోటరీ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు నేటి యువత ప్రేరణగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.