ప్రజాశక్తి -ఆనందపురం : హృద్రోగంతో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి మండలంలోని బోయపాలేనికి చెందిన ఒఎస్‌జి ఫౌండేషన్ సంస్థ దాతల ద్వారా సమకూర్చిన రూ.25వేల ఆర్థికసాయాన్ని బాధిత కుటుంబీకులకు బుధవారం అందజేశారు. స్టార్ పినాకిల్ హాస్పిటల్ నందు అందించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం గొనప పుట్టుగ గ్రామానికి చెందిన లండ సంతోషి అనే మూడేళ్ల బాలిక గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ, స్టార్ పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక గుండె ఆపరేషన్‌కు రూ.ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు నిర్థారించిన నేపథ్యంలో నిరుపేద కుటుంబానికి చెందిన బాలిక తల్లిదండ్రులు తమ బిడ్డ వైద్యానికి సాయం చేయాలని పలు స్వచ్ఛందసంస్థలు, దాతలను సోషల్‌మీడియా ద్వారా అభ్యర్థించారు. బాలిక తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి, నిస్సహాయతపై ఒఎస్‌జి ఫౌండేషన్ కూడా స్పందించి, దాతల ద్వారా విరాళాలను సేకరించి, వచ్చిన మొత్తం రూ.25వేలను బుధవారం ఆసుపత్రిలో బాలిక తల్లిదండ్రులకు అందజేశారు. మరికొంతమంది దాతలు కూడా సాయం చేశారని ఒఎస్‌జి సంస్థ ప్రతినిధి శివ దళాయి తెలిపారు. బాలికకు ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారని, మొదటి ప్రయత్నంలో ఆపరేషన్ ఫెయిలైనప్పటికీ, రెండో ప్రయత్నంలో మళ్లృ ఆపరేషన్ చేశారని, ప్రస్తుతం పాప ఐసియులో ఉన్న చిన్నారికి ప్రాణాపాయం తప్పి కోలుకుంటోందని వైద్యులు చెప్పారనిశివ తెలిపారు. మెరుగైన వైద్యం, కోలుకునేందుకు మరికొంత సమయం పట్టనున్న నేపథ్యంలో బాధిత కుటుంబానికి దాతలు చోదోడుగా నిలవాలని శివ కోరారు.










