Aug 14,2021 15:43

ఓ 67 ఏళ్ల ముసలాయన ఇంగ్లాండ్‌ ఈస్ట్‌బోర్న్‌లోని ఓ బ్యాంకులోకి ప్రవేశించి.. నేరుగా క్యాషియర్‌ దగ్గరకు వెళ్లి.. అతని చేతిలో ఓ చీటీ పెట్టి చాలా ధీమాగా రెండు ప్యాంట్స్‌ జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడ్డాడు. ఆ క్యాషియర్‌ ఆ చీటిని చదవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ చీటిలో ఏముందో అర్థంకాక దాన్ని పక్కన పెట్టేసి తన పనిలో తాను మునిగిపోయాడు. ఇక ఆ ముసలాయన క్యాషియర్‌వైపు ఎగాదిగా చూసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ చీటి తోటి సిబ్బందిలో ఒకరి దగ్గరకి చేరింది. ఆ చీటిని చదివిన సిబ్బందికి ఆ చీటిలో ఉన్నది చూసి షాకై.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఆధారంగా అన్వేషణ ప్రారంభించారు.
ఈసారి అదే బ్యాంకుకు చెందిన మరో బ్రాంచ్‌కి వెళ్లి అతను అదేవిధంగా క్యాషియర్‌ దగ్గరకు వెళ్లి చీటీ పెట్టాడు. ఆ చీటిని చూసి ఆ క్యాషియర్‌ ఈసారి డబ్బులు ఇచ్చాడు. డబ్బు తీసుకుని ముసలాయన బ్యాంకు నుంచి వెళ్లిపోయాడు. కొన్ని గంటల తర్వాత అదే ముసలాయన మరో బ్యాంకుకి వెళ్లి క్యాషియర్‌ దగ్గరకు వెళ్లి చీటీ పెట్టగానే.. సదరు క్యాషియర్‌ వెంటనే ముసలాయనపై సీరియస్‌ అవ్వడంతో.. చేసేదేమీ లేక బ్యాంకు నుంచి బయటకు వచ్చేశాడు. అసలు ఆ చీటిలో ఏముంది..? దాన్ని చూసిన సిబ్బంది భయంతో అతనికి డబ్బులెందుకు ఇస్తున్నారు.. ఇదంతా చూస్తే.. హర్రర్‌ మూవీని తలపించేవిధంగా ఉంది కదూ..! నిజంగానే ఈ సంఘటన జరిగింది. అసలతనెవరు? ఎక్కడా అనుకుంటున్నారా.. ఇంగ్లాండ్‌లో హ్యాస్టింగ్స్‌లోని సేయింట్‌ లియోనార్డ్స్‌కు చెందిన అలన్‌ స్టాటరీ (67). ఇతనే ఆ మూడు బ్యాంకులకు వెళ్లి క్యాషియర్లకు చీటీలు చూపించింది.
ఇంతకీ ఆ చీటిలో ఏముందంటే.. '' నా దగ్గర ఉన్న దాన్ని(పిస్టల్‌ను ఉద్దేశిస్తూ) మీ సీసీ కెమెరాలు బంధించక మానవు. మిగిలిన కస్టమర్ల గురించి కూడా ఓ సారి ఆలోచించు. మర్యాదగా నేనడిగిన డబ్బు ఇవ్వు'' అని రాసి ఉంది.