ప్రజాశక్తి- మధురవాడ : నూతన హరిత సాంకేతిక పరిజ్జానంలో వ్యవసాయరంగాన్ని లాభసాటిగా చేసినప్పుడే భవిష్యత్తులో దేశ అవసరాలకు తగ్గట్టుగా ఆహర పంటలను ఉత్పత్తి చేయగలమని దక్షిణాసియా పర్యావరణ వేదిక అధ్యక్షుడు డాక్టర్ దిప్యాన్ దే అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పర్యావరణ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 'సుస్థిర అభివద్ధికి హరిత సాంకేతిక పరిజ్ఞానం' అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా దిప్యాన్ దేమాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకుని నిలిచేలా దేశ వ్యవసాయరంగం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో వ్యవసాయరంగాన్ని సుస్థిర పరచాలంటే సాగుదారుడితో పాటు, ప్రభుత్వ విధానాలు, బ్యాంకింగ్ రంగం, వ్యవసాయ పరిశోధనలు, సామాజిక కార్యకర్తలు, విశ్వవిద్యాలయాలు ఏకతాటిగా పనిచేయాలని అభిప్రాయ పడ్డారు.
కువైట్ వాటర్ రీసెర్చి సెంటర్ డాక్టర్ ఎస్.ధనురాధ హరిత సాంకేతిక పరిజ్జానంతో నీటివనరులను ఏవిధంగా శుద్ది చేయవచ్చునో వివరించారు. పోలాండ్‌కు చెందిన బిల్డింగ్ సర్వీసెస్ విభాగం పరిశోధకుడు ఎవా కర్వోవ్‌స్కా భవన నిర్మాణ సామగ్రి సామర్థ్యం పెంచడానికి జీవశిలీంద్రాలు ఏవిధంగా ఉపకరిస్తాయో వివరించారు. గీతం పర్యావరణ శాస్త్రవిభాగం సీనియర్ ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాస్ ఫైటో కెలటిన్ వినియోగించి భూపొరలలో ప్రమాదకర కాలుష్యకారకాలను తొలగించే విధానాలు వివరించారు. పశ్చిమ బెంగాల్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇకలాజికల్ ఇంజనీరింగ్ పరిశోధకుడు ప్రొఫెసర్ జయంతకుమార్ బిస్వాస్ వ్యర్ధజలాలను శుద్ధికి హరిత సాంకేతిక పరిజ్జానం వినియోగంపై వివరించారు. సంబల్‌పూర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సంజత్ కుమార్ సాహూ పట్టణ వ్యర్థాల నిర్వహణలో వర్మీ కంపోస్ట్ ప్రాధాన్యతను వివరించారు. గీతం పర్యావరణశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సరిత అధ్యక్షత వహిచిన సదస్సులో కన్వీనర్ డాక్టర్ డాక్టర్ ఎమ్.కిరణ్మయి రెడ్డి మాట్లాడుతూ సదస్సును వర్చ్యువల్ విధానంలో రాజస్థాన్, బెంగాల్, ఒడిస్సా, అనంతపూర్ ప్రాంతాలలోని విద్యాలయాల ప్రతినిధులు పరోక్షంగా పాల్గొన్నారని తెలిపారు.










