
ప్రజాశక్తి - భట్టిప్రోలు
మండలంలోని ఐలవరం జెడ్‌పి ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు పచ్చారు హరికృష్ణను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మెరుగు నాగార్జున బుధవారం ఘనంగా సన్మానించారు. పాఠశాలలో పనిచేస్తూ స్కైప్ ద్వారా విద్యార్థులతో విదేశీ ఉపాధ్యాయులు, విద్యార్థులతో నిరంతరం సంభాషణ చేయిస్తూ విద్యార్ధుల్లో ఆంగ్ల బాషపై అవగాహన పెంచేవిధంగా హరికృష్ణ పనిచేస్తుంటారు. దీనిలో భాగంగా సౌత్ కొరియా నుండి పాఠశాలకు గిఫ్ట్ బాక్స్ ఒకటి బుధవారం అందింది. విద్యార్థులకు అవసరమైన బహుమతులు, బిస్కెట్లు, చాక్లెట్లు ఉన్న ఈ బాక్స్‌ను మంత్రి నాగార్జున చేతుల మీదగా ఆవిష్కరించారు. అలాగే సౌత్ కొరియా ఆంగ్ల ఉపాధ్యాయులు సన్ యంగ్ కిం గత మూడేళ్లుగా ఐలవరం ఉన్నత పాఠశాల విద్యార్థులతో సంభాషిస్తూ ఉంటారు. దీంతో ఆమె ఈ గిఫ్ట్ బాక్స్ ను పంపించినట్లు హరికృష్ణ వివరించారు. విదేశీ ఉపాధ్యాయులు, విద్యార్ధులతో మాట్లాడించడం వల్ల ఆంగ్లబాషపై విద్యార్ధులకు ఆసక్తి పెరిగిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అందించే గ్లోబల్ ప్రైజెస్ అవార్డుకు ఎంపికైన 50మందిలో వచ్చారు హరికృష్ణ ఉండటం పాఠశాలకు, నియోజకవర్గానికి గర్వకారణమని మంత్రి నాగార్జున పేర్కొన్నారు. ఈ మేరకు హరికృష్ణను ఆయన అభినందించారు. కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, ఎంపీపీ రావూరి వెంకట లలిత కుమారి, జడ్పిటిసి ఉదయ భాస్కరి, సర్పంచ్ మాచర్ల కోటేశ్వరరావు, కో ఆప్షన్ సభ్యులు షేక్ సలీం, వేమూరు ఎఎంసి డైరెక్టర్ జొన్నాదుల కోమలి శరత్, నాయకులు మాచర్ల హేమ సుందరరావు, హెచ్ఎం మాచర్ల మోహనరావు ఉన్నారు.