Oct 13,2023 23:14

హోటల్‌ రివ్యూలతో నయా దందా

హోటల్‌ రివ్యూలతో నయా దందా
చిత్తూరుఅర్బన్‌: ప్రముఖ హోటళ్ల గురించి రేటింగ్‌ ఇచ్చి ఫీడ్‌ బ్యాక్‌ రాస్తే డబ్బులు ఇస్తామని వచ్చే వాట్సాప్‌, టెలిగ్రామ్‌ల ద్వారా వచ్చే మెసేజ్‌ లను నమ్మొద్దని ఎస్‌పి రిషాంత్‌రెడ్డి హెచ్చరించారు. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూపులలో యాడ్‌ అవ్వొద్దని, ఒకవేళ యాడ్‌ అయితే వెంటనే ఎగ్జిట్‌ అయి బ్లాక్‌ చేయాలని, సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇటీవల విశాఖపట్నంలో సైబర్‌ నేరగాళ్లు చేసిన మోసాన్ని వివరించారు. టాస్కుల ఎంట్రీ ఫీజు, జిఎస్టి, ప్రాసెసింగ్‌ ఫీజు వంటి పలు రకాల పేర్లతో మన దగ్గర నుండి మనకు రావాల్సిన డబ్బులు కంటే కొన్ని రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారని, ఒకవేళ మనం డబ్బులు కట్టకుండా ఉన్నా.. వారు ఇచ్చిన టాస్కులు చేయకుండా ఉన్నా 'నువ్వు ఉన్న టెలిగ్రామ్‌ గ్రూపులోని మిగతావారు నీకు కాల్‌ చేసి నువ్వు టాస్క్‌ కంప్లీట్‌ చేస్తేనే మాకు అందరికీ కూడా డబ్బులు వస్తాయని చేయకపోతే మా సమస్యలకు నువ్వే కారణం అవుతావు' అంటూ బెదిరించి, మానసికంగా వేధిస్తారని తెలిపారు. ఇలా ఒక్కసారి నమ్మి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్లయితే మానసికంగా, ఆర్థికంగా నిరంతరం వేధింపులకు గురి చేస్తూ బ్లాక్మెయిల్‌ చేస్తారు. కావున దయచేసి ఎవరూ ఇటువంటి వాటిని నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఎవరైనా సైబర్‌నేరానికి గురైతే 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.