
- ప్రశ్నించిన న్యూస్ పోర్టల్‌పై కేసులు
గువహతి : అసోం రాష్ట్రంలో పలుచోట్ల బిజెపి మంత్రుల హోర్డింగులు వెలిసిన ఘటనపై ప్రశ్నించిన ఓ స్వత్రంత న్యూస్ పోర్టల్ 'ది క్రాస్ కరెంట్' పై కేసు నమోదైంది. అసోంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ (డిఐపిఆర్) ఈ పోర్టల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 45 కింద తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొనడంతో దిస్పూర్ పోలీసులు కేసు నమోదుచేశారు. రాష్ట్ర సిఎం హిమంత బిశ్వశర్మ, సమాచార, ప్రజాసంబంధాల మంత్రి పిజూష్ హజారికాలు ఉన్నటువంటి హౌర్డింగులు రాష్ట్ర వ్యాప్తంగా వేలిశాయి. వాటిల్లో ఒలంపిక్ క్రీడల్లో మెడల్ సాధించిన బాక్సర్ లవ్లీనాను అభినందించడం, అసోం మాజీ సిఎం గోపీనాథ్‌ను స్మరించుకోవడం కనిపించింది. వారి ఫొటోలు కనిపించకుండా.. కేవలం మంత్రుల ఫొటోలు మాత్రమే ఆ హోర్డింగుల్లో కనిపిస్తున్నాయి. దీనిని ప్రశ్నిస్తూ.. ది క్రాస్ కరెంట్ పోర్టల్ ఓ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే రిపోర్టర్ గౌతమ్ ప్రతిమ్ గొగోరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక రాత్రి మొత్తం పోలీసు స్టేషన్‌లో గడపాల్సి వచ్చిందని ఆయన పేర్నొన్నారు. ఈ కథనానికి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు సహా ఇతర ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించబడినట్టు తెలిపారు. డీఐపీఆర్ దీనిని ఏర్పాటు చేసిందని తాము పేర్కొనలేదనీ, ఈ హౌర్డింగులు వెలువడంపై ప్రశ్నించామని అన్నారు.
కాగా, ఈ హౌర్డింగులపై వివాదం ఒలంపిక్ క్రీడలు ప్రారంభానికి ముందే మొదలైంది. బాక్సర్ లవ్లీనా బదులు అసోం క్రీడల మంత్రి బిమాల్ బోరా చిత్రంతో కూడిన హోర్డింగులు గువహతి సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వెలిశాయి. ఆ తర్వాత లవ్లీనా ఫొటో లేకుండా ఇదే అంశంలో శర్మ ఫొటోలతో హోర్డింగులు వెలిశాయి. వీటిపై ఏ ప్రభుత్వ విభాగము పేరు ప్రస్తావించబడలేదు. ఈ క్రమంలో శర్మ, బోరాలు తమ ప్రచారం కోసం ఇంతలా దిగజారుతారా? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఏ శాఖ పేరు లేకుండా ఇలాంటి హోర్డింగులు ఎవరు ఏర్పాటు చేశారనే ప్రశ్నను ది క్రాస్ కరెంట్ పోర్టల్ లేవనెత్తింది. వారికి తెలియకుండా వారి ఫొటోలతో అంతపెద్ద మొత్తంగా హౌర్గింగులు ఎలా వెలుస్తాయని ప్రశ్నించింది. దీని వెనుక ప్రజా సంబంధాల విభాగం ఉందా? అని ప్రశ్నించింది. ఇక ప్రశ్నిస్తే కేసులు పేడతారా అంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.