ప్రజాశక్తి-విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరుగుతున్న వివిధ ఆటలు పోటీలు రెండో రోజైన శనివారం హోరాహోరీగా ఉత్కంఠభరితంగా జరిగాయి. ముందుగా కమిషనర్ టీమ్ వర్సెస్ పిఓ యుసిడి టీంల మధ్య జరిగిన ఫైనల్ క్రికెట్ మ్యాచ్‌లో కమిషనర్ టీమ్ విజయకేతనం ఎగరేసింది. ఈ మ్యాచ్‌లో కమిషనర్ టీం 15 ఓవర్లకు 128 పరుగులు చేసింది. వాలీబాల్ పోటీలో మేయర్ టీమ్ విన్నర్‌గా నిలవగా, ఇంజినీరింగ్ టీమ్ రన్నర్‌గా నిలిచింది. బ్యాట్‌మెంటన్‌లో ఇంజినీరింగ్ టీమ్ విన్నర్‌గా, సబ్‌కలెక్టర్ టీమ్ రన్నర్‌గా నిలబడ్డాయి. సింగిల్స్‌లో కార్పొరేటర్ విన్‌డిఎస్ మూర్తి గెలుపొందారు. డ్రాయింగ్, పెయింటింగ్, డ్యాన్స్, ఏకపాత్రాభినయం, భరతనాట్యం, కూచిపూడి పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ విఎంసి ఉద్యోగులు, అధికారులు క్రీడల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమాల్లో కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు డాన్స్‌లు వేసి అందరినీ ఉత్సాహపరిచారు.










