Dec 19,2022 23:39

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలు ఉత్సాహంగా సాగుతున్నాయి. తెలుగురాష్ట్రాల క్రీడాకారులు రాణిస్తున్నారు. ముఖ్యంగా మెడల్స్‌ జాబితాలో తెలంగాణ దూసుకుపోతుంది. ఇప్పటివరకు తెలంగాణ క్రీడాకారులు వివిధ విభాగాల్లో 27 పతకాలు కైవసం చేసుకుంది. వీటిలో 14 స్వర్ణం, నాలుగు రజతం, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ 11 పతకాలు దక్కించుకుంది. వీటిలో రెండు స్వర్ణం, 5 రజతం, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. ఓవరాల్‌ మెడల్స్‌ జాబితాలో గుజరాత్‌ 20 పతకాలతో రెండవ స్థానంలో ఉంది. సోమవారం జరిగిన అథ్లెటిక్స్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ బాలికలు ఉత్తమ ప్రతిభ కనపరచారు. అండర్‌ -19 బాలికల ట్రిపుల్‌ జంప్‌లో 9.90 మీటర్లతో రాష్ట్రానికి చెందిన డి.శ్రీజ మొదటి స్థానంలో నిలిచింది. 9.55 మీటర్లతో తెలంగాణఖు చెందిన బొంత స్నేహ రెండవ స్థానం, 9.30 మీటర్లతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీవల్లి మూడవ స్థానం సాధించింది.
డిస్కస్‌ త్రో: అండర్‌ -14 బాలుర విభాగంలో డిస్కస్‌ త్రో లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. 29.79 మీటర్లతో మిఒదటి స్థానం బోయ మహేంద్ర సాధించగా, 25.99 మీటర్లతో రెండవ స్థానంలో మన రాష్ట్రానికి చెందిన వి.సుశాంత్‌ రెడ్డి నిలిచాడు. 24.53 మీటర్లతో ఉత్తరాఖండ్‌కు చెందిన రాజేష్‌ చౌహాన్‌ మూడవ స్థానం సాధించాడు.
హైజంప్‌: అండర్‌-19 బాలుర కేటగిరిలో 1.64 మీటర్లతో ఓడిశాకు చెందిన ఎం.రంజిత్‌ మొదటి స్థానం, 1.64 మీటర్లతో ఒడిశాకు చెందిన హెచ్‌. దీపక్‌ రెండవ స్థానం, 1.61 మీటర్లతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన కె.అనిష్‌ మూడవ స్థానం సాధించారు.
800 మీటర్ల పరుగు: అండర్‌ -19 బాలుర విభాగంలో చత్తీస్‌ఘడ్‌కు చెందిన అరుణ్‌ కొవచి 2.05 నిముషాల్లో లక్ష్యంచేరి తొలిస్థానం సాధించగా 2.08 నిముషాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిర రంజిత్‌ కుమార్‌ రెండవ స్థానం, 2.12 నిముషాల్లో లక్ష్యంచేరి జార్ఖండ్‌కు చెందిన అలోక్‌ మూడవ స్థానం సాధించాడు.
ఫుట్‌బాల్‌ : గ్రూప్‌-సిలో జార్ఖండ్‌ - కర్ణాటక జట్ల మద్య జరిగిన మ్యాచ్‌లో 11-0 గోల్స్‌ తేడాతో జార్ఖండ్‌ జట్టు గెలుపొందింది. అండర్‌ -19విభాగంలో గ్రూప్‌డి మ్యాచ్‌లో ఓడిశా - సిక్కిం జట్ల మద్య జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్‌ తేడాతో ఓడిశా జట్టు గెలుపొందింది. గ్రూప్‌-ఇలో తమిళనాడు - త్రిపుర జట్ల మద్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. గ్రూప్‌ -బిలో గుజరాత్‌ - రాజస్తాన్‌ జట్ల మద్య జరిగిన మ్యాచ్‌లో 2-0 గోల్స్‌తో గుజరాత్‌ గెలుపొందింది.
ఎఎన్‌యులో ఏర్పాట్లు పరిశీలన
ప్రజాశక్తి-ఎఎన్‌యు: ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ప్రాంగణంలో రెండో రోజు ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్చరీ, కబడ్డీ, అథ్లెటిక్స్‌, వాలీబాల్‌, ఖోఖో క్రీడలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో క్రీడాకారుల వసతుల ఏర్పాట్లను గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న కబడ్డీ పోటీలను పరిశీలించారు. కబడ్డి కోర్టులోకి వెళ్లి కాసేపు మ్యాచ్‌ ను తిలకించారు. ఉత్సాహంగా ఆటల పోటీలలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శిస్తున్న విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. కాంతిలాల్‌ దండేతో పాటు జాయింట్‌ సెక్రటరీ హేమలత సహా గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.