పూర్తి స్థాయిలో తాగునీరు అందేనా..
ఐలాండ్‌లో నీటి గుంతల ఏర్పాటుకు
కలెక్టర్ ఆదేశం
ఆర్నెళ్లయినా ముందుకు కదలని పనులు
ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్
కాకినాడ తీరప్రాంతానికి కొద్ది దూరంలో బంగాళాఖాతంలో ఒక చిన్న టాడ్‌పోల్ ఆకారంలో ఉన్న ద్వీపం హోప్ ఐలాండ్. కాకినాడ తీరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ఐలాండ్ ఉంది. తుపానులను అడ్డుకుంటూ కాకినాడ నగరానికి ఇది కవచంగా ఉంది. ఇటీవల కాలంలో ఈ ఐలాండ్‌కు పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. అయితే అక్కడ తాగునీరు ప్రధాన సమస్యగా ఉంది. అక్కడ తాగునీటిని నిల్వ చేయడానికి నీటి గుంతలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ యోచించారు. ఇందులో భాగంగా నిధులను సైతం మంజూరు చేశారు. కాని ఈ పనులు నేటికీ ముందుకు సాగడం లేదు.
4హోప్ ఐలాండ్... అదో అద్భుతం
హోప్ ఐలాండ్ తూర్పుతీరంలో ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం. హౌప్ ఐలాండ్ మధ్య ప్రాంతాన్ని కాకినాడ బే అని పిలుస్తారు. అరుదైన మొక్కలు, జంతువులకు ఇది పెట్టింది పేరు. దాదాపు 146 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. ఈ ఐలాండ్‌లో పుత్రయ్య పాకలు, సొర్లగొండు పాకలు అనే రెండు చిన్న మత్స్యకారుల కుగ్రామాలు ఉన్నాయి. దాదాపు 400 కుటుంబాలు జీవిస్తున్నాయి. అక్కడక్కగా కొన్ని ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. కాకినాడ బేలో లంగరు వేసిన నౌకలకు ప్రశాంతతను అందిస్తుంది ఈ ఐలాండ్. తూర్పు తీరంలో సురక్షితమైన సహజ ఓడరేవుల్లో ఇది ఒకటి. ద్వీపం ఉత్తర కొనను 'గోదావరి పాయింట్' అని పిలుస్తారు. భారత సాయుధ దళాలు ఈ ద్వీపాన్ని తరచుగా బీచింగ్ ప్రాక్టీస్ కోసం ఉపయోగిస్తాయి.
4మౌలిక వసతులు కరువు
ఎక్కడ నివాసం ఉంటున్న కుటుంబాలకు కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. తాగునీటి కోసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న బావి నుంచి ఇక్కడ మహిళలు నీటిని సేకరిస్తారు. అది కూడా గంటల తరబడి నీరు ఊరేదాకా ఎదురుచూసి వాటిని తోడుకుని వస్తారు. గతేడాది కలెక్టర్ కృతికా శుక్లా ఈ ఐలాండ్‌ను సందర్శించారు. అక్కడ మత్స్యకారులకు వసతులు పూర్తిస్థాయిలో అందడం లేదని గుర్తించారు. తాగునీటి కొరతను గుర్తించి మంచినీటి వసతుల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.
419 లక్షలతో నీటి గుంట ఏర్పాటు
కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రణాళికలు రచించారు. ఐలాండ్‌ను సందర్శించి నీటిగుంతకు ఎంత స్థలం అవసరం? వర్షపు నీటిని ఎలా నిల్వ చేయాలి? దాని తాగునీటిని ఎలా అందించాలనే దానిపై నివేదికను తయారు చేశారు. ఈ పనుల కోసం రూ.19 లక్షల వరకూ ఖర్చుఅవుతుందని ప్రతిపాదనలు చేశారు. ఈ పనులకు సంబంధించి జలజీవన్ మిషన్ ద్వారా టెండర్లను పిలవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే బిల్లులు సకాలంలో రాకపోవడం, ఐలాండ్‌లో పనుల నిర్వహణకు ప్రయాణ ఖర్చులు, సామగ్రి చేరవేతకు ఖర్చులు ఎక్క్వుడా ఉండటంతో గుత్తేదారులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో అత్యవస నిధుల్లో భాగంగా మరో రూ.13 లక్షలను కలెక్టర్ విడుదల చేశారు. దీంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. పనులకు టెండర్ పిలిచి మూడు నెలలు అవుతున్నా నేటికీ మాత్రం పనులు ప్రారంభించలేదు.
4అదనపు భారంతో ఇబ్బందులు
ఐలాండ్‌లో పనులు ఇటు అధికారులకు, అటు కాంట్రాక్టర్లకు కత్తి మీదసాములా మారాయి. ఐలాండ్ వెళ్లి రావాలంటే రూ.10వేలు ఖర్చు అవుతుంది. ఇప్పటివరకు అధికారులు సుమారు ఐదుసార్లకుపైగా హైలాండ్‌ను సందర్శించారు. అయితే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా అక్కడికి యంత్రాలను తీసుకెళ్లడానికి రూ.5 లక్షలకుపైగా ఖర్చు అవుతుండడంతో గుత్తేదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రెండు రోజులకు ఒకసారి ట్యాంకుతో తాగునీటిని తీసుకెళ్లేందుకు కూడా అవకాశం ఉండట్లేదు. సొంతంగా బోటు లేకపోవడం, మెరైన్ అధికారులు, కస్టమ్స్ అధికారులు తమ పడవలను కూడా ఇవ్వకపోవడం దీనికి కారణం. దీంతో ఈ పనిని కూడా అధికారులు విరమించుకున్నారు.
వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తాం
ఐలాండ్ ప్రజలకు తాగు నీటిని అందించేందుకు నీటి గుంత తవ్వాలని నిర్ణయించాం. మరో వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తాం. అక్కడికి వెళ్లి వచ్చేందుకు కష్టతరమవుతున్న నేపథ్యంలో పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. త్వరలోనే సమస్యలను పరిష్కరించుకని సమన్వయంతో పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తాం.
- వివిఆర్.చౌదరి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఆర్‌డబ్ల్యూఎస్










