Dec 06,2022 23:49

శ్వేత పావురాన్ని ఎగురవేస్తున్న ఎస్‌పి గౌతమి శాలి

ప్రజాశక్తి-అనకాపల్లి
హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు జిల్లా ఎస్‌పి గౌతమిశాలి అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం హోంగార్డుల 60వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ముందుగా హోంగార్డుల పెరేడ్‌ను పరిశీలించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. శ్వేత పావురాన్ని గాలిలో ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పోలీసులకు అత్యవసర సమయాల్లో సహకరించేందుకు ఏర్పడిన హోంగార్డుల వ్యవస్థ పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతుందని తెలిపారు. ప్రస్తుతం అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 690 మంది హోంగార్డులు ఉండగా వారిలో 89 మంది మహిళ హోంగార్డులు ఉన్నట్లు చెప్పారు. ట్రాఫిక్‌ విధులు, రాత్రి గస్తీ, శాంతి భద్రతల పరిరక్షణలో విశేష కషి చేస్తున్నారని అభినందించారు. అనారోగ్యంతో మరణించిన హోంగార్డుల కుటుంబాలకు రావలసిన అన్ని బెనిఫిట్స్‌ అందేలా చర్యలు తీసుకుంటున్నామని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నామని తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ విజయభాస్కర్‌ మాట్లాడుతూ నిబద్ధత, క్రమశిక్షణ, అంకిత భావంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు ఆర్‌ఐ దాడి కోటేశ్వరబాబు, ఎస్బి సిఐ అప్పలనాయుడు, ఆర్‌ఐలు రామకృష్ణ, వెంకట్రావు, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.