Aug 19,2023 00:45

హోంగార్డు కుటుంబానికి బాసట
ప్రజాశక్తి -తిరుపతి సిటీ
అనారోగ్య కారణాలతో మరణించిన హౌమ్‌ గార్డ్‌ పద్మేష్‌ బాబు భార్య యమున కు శుక్రవారం పోలీస్‌ పెరేడ్‌ మైదానం నందు జరిగిన కార్యక్రమంలో కారుణ్య నియామకాల కింద హౌంగార్డ్‌ గా ఉద్యోగం ఇప్పించి, ఉద్యోగ నియామక ఉత్తర్వుల పత్రాలను అందజేసి జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధులకు సంబంధించి, పోలీసు ఉద్యోగం విలువలను, నేటి సమాజంలో నడుచుకోవలసిన తీరును ఆమెకు వివరించారు. కుటుంబ ఆధారం కోసమో లేదా జీతం తెచ్చిపెట్టే ఒక ఉద్యోగం కోసమే కాక ప్రజలకు సేవ చేస్తున్నామనే భావంతో విధులు నిర్వహించాలని సూచించారు. ఉద్యోగంలో చేరే మొదటిరోజు ఎంతటి ఉత్సాహంతో విధులకు హాజరు అవుతారో అదే ఉత్సాహం చివరి వరకు కొనసాగాలని కోరారు. సమాజంలో పోలీసు విభాగానికి ఉన్న విలువలను కాపాడుతూ, తమ కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వహించాలని ఆమెకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్‌, లక్ష్మీ నారాయణ రెడ్డి, ఏఆర్‌ డిఎస్పిలు రవీంద్రారెడ్డి, చంద్రశేఖర్‌, హౌంగార్డ్స్‌ ఆర్‌.ఐ శ్రీనివాసులు, ఆర్‌ఐలు చంద్రశేఖర్‌, రెడ్డప్ప రెడ్డి, చలపతి, నాగభూషణం, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.