ప్రజాశక్తి-కూనవరం
దళితుడైన తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి, డోర్ డెలివరీ చేసిన కేసులో జైలు నుండి షరతులతో కూడిన బెయిల్‌పై వచ్చిన అనంతబాబు బహిరంగ సభకు పోలీసులు అనుమతులు ఎలా ఇస్తారని సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పన కిరణ్ ప్రశ్నించారు. కూనవరంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేకల నాగేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో కిరణ్ మాట్లాడారు. గతేడాది గోదావరి వరదల సందర్భంగా ప్రజలు ఎన్నడూ చూడలేని బీభత్సాన్ని చూశారని, అనేక కష్టాలు అనుభవించారని, అయినా ఆ నాడు అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు ప్రజలను పట్టించుకోకుండా తిరిగారని తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం పరామర్శించని అనంతబాబు నేడు సొంత ఇమేజ్ పెంచుకునేందుకు ఈ నెల 9న కూనవరంలో సభ పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ ప్రజా సమస్య పరిష్కారానికి ఈ సభ పెడుతున్నాడో అనంతబాబు చెప్పాలని ప్రశ్నించారు. 2022 గోదావరి వరదల సందర్భంగా మునిగిన అన్ని గ్రామాలను మొదటి కాంటూరు చేర్చి నిర్వాసితులకు 2024 ఎన్నికల లోపు పరిహారం అందిస్తానని సభలో హామీ ఇవ్వగలడా? ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ గురించి జగన్‌ను ప్రశ్నించే దమ్ముందా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు అనంతబాబుకు భజన చేయడం తప్ప, ప్రజా సమస్యల పరిష్కారానికి కషి చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మర్లపాటి నాగేశ్వరరావు, సీసం సురేష్, ఐవి, పూనెం సత్యనారాయణ, పల్లపు వెంకట్ పాల్గొన్నారు.
అనంతబాబు సభ వల్ల ఒరిగేదేమిటి? : ఎపిఎజిఎస్
విఆర్.పురం : కూనవరంలో ఎమ్మెల్సీ అనంతబాబు నిర్వహిస్తున్న బహిరంగ సభ వల్ల పోలవరం నిర్వాసితులకు గాని, ఈ ప్రాంత ప్రజానీకానికి గాని ఒరిగేది ఏమిలేదని ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రంపచోడవరం జిల్లా కార్యదర్శి పులి సంతోష్‌కుమార్ ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో తన బినామీలను గెలిపించుకోవటానికే ఈ సభ అని ఎద్దేవా చేశారు. శుక్రవారం రేఖపల్లిలో ఈ.సిరిమల్లిరెడ్డి అధ్యక్షతన జరిగిన సంఘం ముఖ్యకార్యకర్తల సమావేశంలో సంతోష్ కుమార్ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షలు పరిహారం ఇస్తామని ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. గతేడాది వరదలు వచ్చి ప్రజలంతా బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తుంటే నాడు ఏ మూలన కూర్చున్నాడో చెప్పాలన్నారు. జిఓ 3ను రద్దు చేసినపుడు అనంతబాబు నోరు ముగబోయిందా? బోయవాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేర్చి జగన్ ప్రభుత్వం ఆదివాసీల మనుగడకే పెద్ద అన్యాయం చేసినపుడు అనంతబాబు నోరు, చేతులు, కాళ్ళు పనిచేయలేదా? అని ప్రశ్నించారు. ఈ ప్రాంతం నుంచి గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు ఏమి చేశారని మండిపడ్డారు. గెలిచి హత్యలు చేస్తూ, స్మగ్లింగులు చేస్తూ, అడవిని అమ్ముకుంటూ, కేసులైతే అధికారాన్ని ఉపయోగించి ఎలా బయటపడాలని చూస్తున్నారు తప్పా వారికి ప్రజాసమస్యలు పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజానీకం ఆలోచించాలని, అనంతబాబు సభను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయకులు కారం నాగేష్, బాబు, బొర్రయ్య, పూనెం ప్రదీప్ కుమార్, ఇర్పా అజరు, పులి బొజ్జి, కారం సుందరయ్య, రేగులపాడు సర్పంచ్ శంకర్, కారం ధర్మరాజు పాల్గొన్నారు.
బెయిల్‌పై వచ్చిన వ్యక్తికి సెక్యూరిటీ ఎలా కల్పిస్తారు? : మాజీ ఎమ్మెల్యే
రంపచోడవరం : తన మాజీ డ్రైవర్ హత్యకేసులో షరతులతో కూడిన బెయిల్‌పై వచ్చిన అనంతబాబుకు పోలీసులు సెక్యూరిటీ ఎలా కల్పిస్తారని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ప్రశ్నించారు. పోలీసులే హంతకులను, గుండాలను సంరక్షిస్తే సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు అని అన్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ భారీ వర్షాలకు గ్రామాలన్నీ పూర్తిగా మునిగిపోతే ఎక్కడెక్కడో తల దాచుకొని తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ప్రజలు అల్లాడిపోయినప్పుడు కనిపించని ఈ నాయకులు ఈనాడు బహిరంగ సభ పెట్టడం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు కారం సురేష్ బాబు, కారం సింహాచలం, వై.నిరంజన్‌దేవి, ఈకా నరసన్న దొర, కురుసం సత్యనారాయణ దొర, వల్లాల వెంకన్న, కోసూరి శ్రీనివాసరావు, పళ్ళల అబ్బాయి రెడ్డి, యాట్ల సత్యనారాయణ రెడ్డి, కురూసం ఈశ్వర్ పాల్గొన్నారు.










