ప్రజాశక్తి-బాపట్ల: చెరుకుపల్లి అమర్నాథ్ హత్య ఘటనకు నిరసనగా ఈ నెల 24న బాపట్లలో జరిగే నిరసన ప్రదర్శనకు ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొనాలని సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం బాపట్ల పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల కార్యాలయంలో సిపిఎం ఆధ్వర్యంలో గంగయ్య అధ్యక్షతన జరిగిన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఆయన మాట్లాడారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్న సమావేశంలో గంగయ్య మాట్లాడారు. అమర్నాథ్ హంతకులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ హత్యలో పాల్గొన్న నలుగురు నిందితుల్లో కేవలం ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేయడంపట్ల సమావేశం తీవ్రంగా ప్రతిఘటించింది. హత్యకు ప్రాణాళక రచించిన నాలుగో వ్యక్తిని అరెస్టు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. అమర్నాథ్ హంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఈ నెల 24న బాపట్లలో జరిగే నిరసన కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల విద్యార్థులు, బాపట్ల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విసీకే పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి ప్రొఫెసర్ సాయిబాబు, అడ్వకేట్ భాస్కర్ గౌడ్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఎం వేణు, బీఎస్పీ నాయకులు విజయరాజు, అంబేద్కర్ సంఘం నాయకులు జి రాజారావు, బీసీ సంఘం నాయకులు గోపీనాథ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్, మహిళా సంఘం (ఐద్వా) నాయకులు సుభాషిణి, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ మజుందార్, సిహెచ్ మణిలాల్, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు వై భాస్కరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్య, మనోజ్, నాయకులు నాగలక్ష్మి, భాను, కెవిపిఎస్ జిల్లా నాయకులు శరత్, ఆటో యూనియన్ నాయకులు వై శ్రీనివాసరావు, దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.










