హంస వాహనంపై శ్రీశైలేసుడు
ప్రజాశక్తి - శ్రీశైలం
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంస వాహనంపై స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో భక్తులకు సోమవారం దర్శనమిచ్చారు. మూడవ రోజున స్వామి అమ్మ వాళ్లకు ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవాలను దర్శించుకున్నారు. హంస వాహనంపై స్వామి అమ్మవార్లను కళాకృతులు, నృత్య ప్రదర్శనల నడుమ విద్యుత్ దీపాలు మధ్య ప్రత్యేక పూజ నిర్వహించారు. రథశాల వద్ద నుండి నంది గుడి వరకు నంది గుడి వద్ద నుండి బయలు వీరభద్ర స్వామి వరకు అక్కడి నుండి ఆలయంలోకి ప్రత్యేక గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ : దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం విజయవాడ వారు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు కి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కె టి భ్రమరాంబ, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు కలిసి పట్టు వస్త్రాలతో ఆలయ రాజగోపాల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ శ్రీశైలం దేవస్థానం అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి అనంతరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి తదితరులు కలిసి స్వాగతం పలికారు. ఆ తర్వాత ముందుగా స్వామివారికి అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని వేద ఆశీర్వచనం మండపంలో వారికి వేద ఆశీర్వచనం చేసి శేష వస్త్రాలను, ప్రసాదాలను జ్ఞాపికలను అందజేశారు.
శ్రీశైలం వెళ్లే భక్తులకు 24 గంటలూ చెక్ పోస్టు వద్ద అనుమతి : మహాశివరాత్రిని పురస్కరించుకొని జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునే మాలధారణ చేపట్టిన శివ స్వాములకు, భక్తులకు ఆదివారం నుంచి శిఖరేశ్వరం - దోర్నాల మన్ననూర్ - దోమల పెంట చెక్ పోస్టుల వద్ద నిబంధనలు సవరించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 21వ తేదీ వరకు మహాశివరాత్రి పూర్తి అయ్యేవరకు 24 గంటలు చెక్ పోస్ట్ తెరిచి ఉంటుందన్నారు. శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.










