Feb 27,2023 20:35

హంస వాహనంపై విహరిస్తున్న జ్వాల నరసింహ స్వామి

హంస వాహనంపై జ్వాలా నరసింహుడు
దిగువలో వైభవంగా ధ్వజారోహణం
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ

       ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఎగువ అహౌబిలంలో జరుగుతున్న బ్రహ్మౌత్సవాలలో భాగంగా మూడవ రోజు సోమవారం హంస వాహనంపై జ్వాలా నరసింహ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. అహౌబిల మఠం 46వ జియ్యర్‌ ఆధ్వర్యంలో బ్రహ్మౌత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవ మూర్తి జ్వాల నరసింహ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసిన అనంతరం మాడ వీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం జ్వాల నరసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు అర్చకుల వేదమంత్రాల నడుమ అభిషేకం నిర్వహించారు. రాత్రి జ్వాల నరసింహస్వామిని సూర్యప్రభ వాహనంపై అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు.
దిగువ అహౌబిలంలో : దిగువ అహౌబిలంలో సోమవారం ఉత్సవాలకు ధ్వజ రోహణ కార్యక్రమం నిర్వహించారు. అహౌబిల మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహదేశికన్‌ స్వామి సమక్షంలో ప్రధాన అర్చకులు వేణుగోపాలచార్యులు, అర్చక బృందం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవ మూర్తులు ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారిని కొలువు మంటపంపై ఉంచి పీఠాధిపతి పూజలు నిర్వహించిన అనంతరం గరుత్మంతుడు కొలువుదీరిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభం పైకి ఎగురవేసి బ్రహ్మౌత్సవాలకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం భేరి తాటను వాయిస్తూ సకల దేవతలకు ఆహ్వానం పలికారు. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాద వరద స్వామిని అలంకరించి సింహ వాహనంపై కొలువుంచి ప్రత్యేక పూజలు చేసి అనంతరం అహౌబిలం మాడ వీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు.