Jul 03,2023 19:32

పాదయాత్రనుద్దేశించి మాట్లాడుతున్న గిడ్డయ్య

ప్రజాశక్తి - దేవనకొండ
హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు ఇచ్చేదాకా పోరాటం కొనసాగిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.మద్దిలేటి శెట్టి తెలిపారు. సోమవారం సిపిఐ మండల కార్యదర్శి ఎం.నరసారావు ఆధ్వర్యంలో హంద్రీనీవా పెండింగ్‌ పనుల పూర్తి కోసం మండలంలోని నేలతలమర్రి గ్రామం నుంచి దేవనకొండ వరకు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర ముగింపు సభ బస్టాండ్‌ ప్రాంతంలో జరిగింది. సిపిఎం నాయకులు యూసుఫ్‌, అశోక్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథులు బి.గిడ్డయ్య, కె.మద్దిలేటి శెట్టి మాట్లాడారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా జిల్లాలో 86 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. దేవనకొండ మండలానికే 45 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన లక్ష్యం నేటికీ నెరవేర్చడంలో పాలక ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. ఇప్పటికీ అధికార లెక్కల ప్రకారం పంట కాలువల నిర్మాణం ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. మండలంలో ఉన్న చెరువులన్నింటినీ హంద్రీనీవా నీటితో నింపాలని డిమాండ్‌ చేశారు. హంద్రీనీవా ఆయకట్టు స్థిరీకరణ పనులు పూర్తి చేసి మండల రైతులకు సాగునీరు, వివిధ గ్రామాల ప్రజలకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నేటి వరకు హంద్రీనీవా సాగునీటికి నోచని మిగులు గ్రామాలకు ప్రధాన కాలువను మళ్లించి గుండ్లకొండ దగ్గర ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి సాగునీరు ఇవ్వాలన్నారు. వేదవతి ప్రాజెక్టు, గుండ్రేవుల, ఆర్‌డిఎస్‌ కుడి కాలువ నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి వడ్డె రాజశేఖర్‌, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు విరుపాక్షి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు భూపేష్‌, నాగేంద్రయ్య, ఆలూరు మండల కార్యదర్శి రామాంజి, రైతు సంఘం సీనియర్‌ నాయకులు యాటకల్లు ఆంజనేయ, కండప్ప, తిమ్మప్ప, బాలాజీ, సిపిఐ మండల సహాయ కార్యదర్శులు వెంకటేశ్వర్లు, నరసింహులు, నల్లచెలిమల శాఖ కార్యదర్శి బజారి, గుడిమరల శాఖ కార్యదర్శి తుకారాం, కోటకొండ శాఖ కార్యదర్శి హరిశ్చంద్ర, పాలకుర్తి శాఖ కార్యదర్శి అశ్వత్థామ, కరివేముల శాఖ కార్యదర్శి నరసింహులు, కుంకనూరు శాఖ కార్యదర్శి గోపాల్‌, ఎఐఎస్‌ఎఫ్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు మధు, భాస్కర్‌, ఎఐవైఎఫ్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు పరమేష్‌, రమేష్‌, హమలీ యూనియన్‌ నాయకులు దస్తగిరి, రమేష్‌, నాగరాజు, ఆటో యూనియన్‌ నాయకులు బడేసాహెబ్‌, వెంకటేష్‌, కార్పెంటర్స్‌ యూనియన్‌ నాయకులు సుల్తాన్‌, సాహెబ్‌, టైలర్స్‌ యూనియన్‌ నాయకులు ప్రసాద్‌, బాషా, రామాంజనేయులు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కోమేష్‌, వీరేష్‌ పాల్గొన్నారు.