Jan 27,2023 22:16

బొమ్మిడి సొసైటీ వద్ద ధర్నా
ప్రజాశక్తి - ఉంగుటూరు

             ధాన్యం హమాలీ ఛార్జీలు రైతులకు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం, ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో మండలంలోని బొమ్మిడి సొసైటీ వద్ద రైతులు, కౌలు రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ కె.అప్పారావు మాట్లాడుతూ రైతులు ధాన్యం తోలి రెండు నెలలు గడుస్తున్నా హమాలీ ఛార్జీలు చెల్లించకపోవడం అన్యా యమన్నారు. బొమ్మిడి సొసైటీ పరిధిలో దాదాపు రూ.10 లక్షల వరకు రైతులకు, కౌలు రైతులకు హమాలీ ఛార్జీలు చెల్లించాల్సి ఉందన్నారు. ధాన్యం సొమ్ము చెల్లించినప్పుడే హమాలీ ఛార్జీలూ చెల్లిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ ప్రకటన ఆచరణలో అమలు కావడం లేదని విమర్శించారు. హమాలీ ఛార్జీలు వెంటనే చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం రైతులు సొసైటీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దుడే కేశవ, లంకా వెంకటేశ్వరరావు, యర్రా వెంకటేశ్వరరావు, బుర్ల చింతాల, వానపల్లి హరికృష్ణ, దుడే రాంబాబు, ఆకుల వెంకన్న, నేరెళ్ల నాగేశ్వరరావు, మద్దాల సత్తిబాబు, మద్దుకూరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.