ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు హెల్త్ అలవెన్స్ కొనసాగించాలని సిఐటియు పట్టణ కార్యదర్శి ఎస్‌కె.సుభాషిణి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద బి.బాలరాజు అధ్యక్షతన మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సుభాషిణి మాట్లాడుతూ కార్మికులు ఈ ఏడాది జూలైలో పెద్దఎత్తున నాలుగు రోజుల సమ్మె చేస్తే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో హెల్త్ అలవెన్స్ ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా రద్దు చేస్తూ ఏడాదిగా తీసుకున్న అలవెన్స్ మొత్తం తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలని సర్క్యులర్ జారీ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని సిఐటియు ఖండిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి జి.లక్ష్మణ్, ప్రసాద్, సత్యవతి, పెంటయ్య, వేల్పుల రాజు పాల్గొన్నారు.










