Oct 18,2023 23:52

సమావేశంలో మాట్లాడుతున్న వెంకటరెడ్డి, నూకరాజు తదితరులు

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : కార్మికులకు హక్కులు కల్పిస్తే నమస్కరిస్తామని, నష్టం కలిగిస్తే పిడికిలి బిగించి పోరాడతామని జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు పి.వెంకటరెడ్డి, అధ్యక్షుడు టి.నూకరాజు, ప్రధాన కార్యదర్శి ఉరికూటి రాజు స్పష్టంచేశారు. జగదాంబ సమీపంలోని సిఐటియు కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, తమ యూనియన్‌ సమ్మె పోరాటం సందర్భంగా జివిఎంసి అధికారులు రాత మూలకంగా ఇచ్చిన మినిట్స్‌లో నీటి సరఫరా విభాగంలో ఉన్న టర్న్‌ కాక్‌లు, ఎలక్ట్రికల్‌ హెల్పర్లకు వేతనాలు రూ.18,500 చెల్లించాలని, ఐటిఐ ఉన్నవారికి స్కిల్‌ వేతనాలు రూ.21,500 అమలు చేయడానికి, డెత్‌ పోస్టులు కార్మికుల బిడ్డలకే ఇవ్వడానికి, హెల్త్‌ రిస్క్‌ ఉన్న చెత్త తరలించే డ్రైవర్లు, వెటర్నరీ, మలేరియా, యుజిడి కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ చెల్లింపునకు, క్లాప్‌ డ్రైవర్లకు రూ.18,500 చెల్లించడానికి, ఈ నెల 19న జరిగే జివిఎంసి కౌన్సిల్‌ సమావేశంలో ఎజెండాగా పెడతామని చెప్పినా ఇప్పుడు పెట్టలేదన్నారు. ఇప్పటికైనా వీటిని ఎజెండాలో పెట్టించాలని, మినిట్స్‌కు గౌరవం ఇవ్వాలని, లేకుంటే ప్రభుత్వం మీద, జివిఎంసి మీద నమ్మకం పోతుందని మంగళవారం వైసిపి ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. మినిట్స్‌ ప్రకారంగా టేబుల్‌ ఎజెండాలో పెట్టి, చర్చించి, ఆమోదించి అమలు చేయకపోతే సిఐటియు విధానం ప్రకారంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మినిట్స్‌ ప్రకారం ఇంజినీరింగ్‌ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న రైవాడ్‌ కెనాల్‌, ఐటిఐ క్వాలిఫికేషన్‌ ఉన్నవారికి మాత్రమే ఎజెండా 4లో చేర్చారని, అదే అంశంలో మిగిలిన వాల్వు ఆపరేటర్లు, ఎలక్ట్రికల్‌ హెల్పర్స్‌, ఫిట్టర్‌ హెల్పర్లను పేర్కొనలేదని వివరించారు. వీరికి గత సంవత్సరం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విడుదల చేసిన ఉత్తర్వు నెంబర్‌-7 ప్రకారం 25 శాతం జీతం పెరగాల్సి ఉందన్నారు. అధికారులు చేసిన తప్పిదం వల్ల వీరికి ఒక్క రూపాయి కూడా పెరగలేదన్నారు. వీరు గత 18, 22 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, పని ఆధారంగా వీరంతా సెమీస్కిల్డు క్యాటగిరీ-2 కిందకు వస్తారని పేర్కొన్నారు. ఈ కౌన్సిల్‌ సమావేశంలో సదరు ఎజెండా 4లో పై మూడు కేటగిరిలకు సంబంధించినవి చేర్చాలని కోరారు.
పబ్లిక్‌ హెల్త్‌ కార్మికుల కారుణ్య నియామకాలు, 60 సంవత్సరాల రిటైర్‌ అయిన కార్మికుల బిడ్డలకు 482 ఖాళీ పోస్టులను కార్మికుల బిడ్డలకే కేటాయిస్తామని మినిట్స్‌లో స్పష్టంగా హామీ ఇచ్చారన్నారు. అయినా 218 మందికి మాత్రమే పోస్టులు ఇచ్చారని తెలిపారు. మిగిలిన 250 పోస్టులను కార్మికుల బిడ్డలకి కేటాయించాలని డిమాండ్‌ చేశారు.