
ప్రజాశక్తి - పెదనందిపాడు రూరల్ : కార్మికుల హక్కులను కాలరాయడమే కాకుండా పోరాటాలపైనా ప్రభుత్వాలు నిర్బంధాలకు దిగుతు న్నాయని, వీటిని ఐక్యంగా తిప్పికొట్టాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ పిలుపిచ్చారు. మండల కేంద్రమైన పెదనందిపాడులోని తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో పి.భువనేశ్వరి అధ్యక్షతన సోమవారం నిర్వహి ంచిన సిఐటియు మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డికి కార్మికుల సమస్యలను చర్చించే సమయం లేకపోయిందన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటమే తోనే కాలక్షేపం చేస్తున్నాయని, ప్రజా సమస్యలు పట్టడం లేదని విమ ర్శించారు. స్కీమ్ వర్కర్లందరికీ పనిభారం పెంచుతూ వారిని వేధింపులు గురిచేయడం దుర్మార్గమన్నారు. ఇదే తీరు కొనసాగితే ప్రభుత్వానికి కార్మికులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సిఐటియు జిల్లా నాయకులు కె.నాగేశ్వరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు నోరు మెదపకపోవడం ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా మోడీ అడుగులకు మడుగులొత్తుతూ సమర్థించటం రాష్ట్ర ప్రజలను మోసం చేయటమే అన్నారు. కార్మికులకు కనీస వేతనాలు పిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని కోరారు. సిఐటియు మండల కార్యదర్శి ఎం.సరిత, నాయకులు శ్రీదేవి, తేరేజమ్మ, ధనలక్ష్మి, సరళ, జాన్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తుళ్లూరు : అసంఘటిత రంగ కార్మికులకు రూ 26 వేలు కనీస వేతనం ఇవ్వాలని, వారికి సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని సిఐటియు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ డిమాండ్ చేశారు. రాజధాని ఏరియా పారిశుధ్య కార్మిక సంఘం విస్తృత సమావేశం సిహెచ్ సుశీల అధ్యక్షతన తుళ్లూరులో నిర్వహించారు. నేతాజీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల కార్మికులు, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాజధానిలో పారిశుధ్య కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తూ కనీస వేతనాలు కూడా చెల్లించడం లేదని అన్నారు. రాజధాని పారిశుధ్య కార్మికులను ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్లోకి తీసుకొని పని భద్రత కల్పించాలని, జీతం రూ.15 వేలు, మెడికల్ అ లవెన్స్ రూ.6 వేలు కలిపి రూ.21 వేలు ఇవ్వాలన్నారు. 15న విజయవాడలో నిర్వహించే ప్రజారక్షణభేరి సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. సంఘం గౌరవ అధ్యక్షులు ఎం.రవి మాట్లాడుతూ కార్మికులకు 18 నెలలుగా పెండింగ్ ఉన్న పిఎఫ్ చెల్లించకుండా తమకు సంబంధం లేదని సిఆర్‌డిఎ అధికారులు చెబుతున్నారని, వెంటనే జమ చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్మికులను పనిలో నుండి తీసేస్తామనే బెదిరింపులు మానుకోకుంటే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అత్యవసరమైన సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, కార్మికుల సమస్యలపై గ్రామాల నుండి గ్రామ పెద్దలు అధికారులకు ఫోన్ చేస్తే కో-ఆర్డినేటర్ నరసింహారావు దురుసుగా మాట్లాడుతున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తొలుత పారిశుధ్య కార్మికులు గ్రామంలో ర్యాలీ చేశారు. నాయకులు సుఖవేణి, గోపిరాజు, కోటేశ్వరరావు, వీర్లంకమ్మ, మౌనిక, కొండమ్మ, దుర్గ, జోజి, శేషయ్య, ముత్యాలు, తిరుపతమ్మ, జ్యోతి, రూతమ్మ, అరుణ్ కుమార్, దేవి, రత్నకుమారి, లక్ష్మి, మార్తమ్మ, మరియమ్మ, రమణ, సిఐటియు నాయకులు పేరం బాబురావు పాల్గొన్నారు.