Jul 17,2023 21:18

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌

కడప అర్బన్‌ : సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు నిరసన కార్యక్రమాలలో పాల్గొనకూడదని, అలా పాల్గొంటే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి రాఘవరెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం ఆయన నిరంకుశ వైఖరికి నిదర్శనమని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు విమర్శించారు. తక్షణం ఉత్తర్వులను ఉపసంహరించుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ జిల్లా విద్యాశాఖాధికారి జారీచేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నాయక్‌ అధ్యక్షతన విద్యార్థి, యువజన సంఘాలతో పాత బస్టాండ్‌ వద్ద సిఐటియు కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల హక్కులు, వారి సమస్యల పరిస్కారం కోసం విద్యార్థులు పోరాటాలు చేసేందుకు వీలు లేదు అని చెప్పడం డిఇఒ నిరంకుశత్వానికి నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వ అధికారిగా కాకుండా అధికార పార్టీ నాయకులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు దగ్గర ఉండటం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాటాలు చేయకూడదని వైసిపి ప్రభుత్వానికి అనుకూలంగా డి.ఈ.ఓ ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేని విద్యాసంస్థలు నడుస్తున్నా, ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా అధిక ఫీజులు వసూలు చేసి దోపిడి చేస్తున్నా చర్యలు తీసుకోలేని డిఇఒ విద్యార్థులను మాత్రం ర్యాలీలు, ధర్నాలలో పాల్గొనకూడదని ఆదేశాలు ఇవ్వడం విడ్డురంగా ఉందన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖాధికారి తను జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్‌, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు మామిళ్లబాబు, పిఎస్‌యూ జిల్లా నాయకులు నాగేంద్ర, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్‌, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి జియావుద్దీన్‌, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి తిరుమలేసు హాజరయ్యారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు గండి సునీల్‌ కుమార్‌, డివైఎఫ్‌ఐ నగర అధ్యక్షులు షాకీర్‌, గోపి పాల్గొన్నారు.
బద్వేలు : విద్యార్థులు నిరసన కార్యక్రమాలలో పాల్గొంటే వారిపైన క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి రాఘవ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్‌ చేశారు. డిఇఒ ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని సోమవారం స్థానిక సుందరయ్య భవనం నందు డివైఎఫ్‌ఐ పట్టణ నాయకులు సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని వారు తెలిపారు. విద్యార్థుల హక్కుల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసేందుకు వీలు లేదని చెప్పడం డిఇఒ నిరంకుత్వానికి నిదర్శమని చెప్పారు.