ప్రజాశక్తి-బాడంగి : కార్మిక హక్కులను కేంద్ర, రాష్ట్ర పాలకులు హరిస్తున్నారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం సిఐటియు మండల విస్తృత స్థాయి సమావేశాన్ని మండల నాయకులు రవణమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులపైన తీవ్రమైన భారాలను మోపుతుందన్నారు. కంపెనీల్లో సంఘం పెట్టుకొనే అవకాశం లేకుండా, కార్మిక సమస్యలపై పోరాటాలు చేయకుండా కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి కార్మికులు కూడా ఓట్లేసి గెలిపించారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని విమర్శించారు. కార్మికులకు నష్టం చేకూర్చే విధానాలను తీసుకొస్తే భవిష్యత్తులో ప్రధాని మోడీని ఇంటికి పంపించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కార్మికులకు అండగా సిఐటియు పోరాటం సాగిస్తోందన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎ.సురేష్, ఎస్.గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
తెర్లాం : తెర్లాంలో ఆదివారం కార్మిక చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం కార్మికులకు ఇవ్వకపోగా, కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సామాన్య కుటుంబం ఈరోజుల్లో జీవించాలంటే కనీసం నెలకు రూ.26 వేలు ఖర్చవుతుందని అనేక కమిటీలు అంచనాలు వేశాయని, కానీ స్కీమ్ వర్కర్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న పాలకులు కనీస వేతనాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కార్మికులంతా ఐక్యంగా పోరాడి హక్కులను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకోవాలని కోరారు. కార్యక్రమానికి సిఐటియు మండల నాయకులు ఎస్.గోపాలం, జి.లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.










