
ప్రజాశక్తి - పర్చూరు
బాలల హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి, సిడిపిఓ జి సుభధ్ర, ఎంఇఓ ఎం సత్యనారాయణ అన్నారు. మండలంలోని గురుకుల బాలికల పాఠశాల, గురుకుల బాలుర పాఠశాల, నాగులపాలెం ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూలు, అంగన్‌వాడీ కేంద్రాలను గురువారం అకస్మిక తనిఖీ చేశారు. నాగులపాలెం ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూలును సందర్శించి వాష్‌రూంలు బాగాలేవని, బాలికలను ఉపాధ్యాయులు దండిస్తున్నారని, తాగు నీరు లేదని, పాఠశాల ఆవరణలోకి పాములు వస్తున్నాయని గుర్తించారు. గుర్తించిన సమస్యలను వారం రోజుల్లోపు పరిష్కరించాలని సూచించారు. నెట్ వాల్స్ ఏర్పాటు చేసి పాములు రాకుండా చూడాలని ఆదేశించారు. బాలల హక్కులకు ఎలాంటి భంగం కలిగినా శాఖా పరమైన చర్యలతో పాటు బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాల యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాలని ఎంఇఒను ఆదేశించారు. విద్యార్ధులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంట శాలను తనిఖీ చేసి వ్యర్ధాలను తీయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. బాలికల వసతి గదులను పరిశుభ్రంగా లేనట్లు గుర్తించారు. మధ్యాహ్న భోజనం రుచికరంగా లేదని, బాలలకు రుచికరమైన ఆహారం అందించాలని కోరారు. రికార్డులు పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్‌లో తప్పులు నమోదు చేస్తున్నట్లు గుర్తించారు. ఆమె వెంట అంగన్‌వాడీ సూపర్‌వైజర్ దీపాదేవి, సిఆర్‌పి సాయి, మహేశ్వరరావు పాల్గొన్నారు.