Dec 30,2022 00:07

ర్యాలీ చేస్తున్న కార్మికులు

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో, కలెక్టరేట్‌
'నేడు విశాఖ నగరం ఇంత కళకళ లాడుతుందంటే స్టీల్‌ప్లాంట్‌, పోర్టు వంటి ప్రభుత్వ రంగ సంస్థలే కారణం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి. వీటిని కాపాడుకుంటూ, హక్కుల రక్షణ కోసం 'కార్మిక వర్గం సమరభేరి' సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ర.నర్సింగరావు ఉద్ఘాటించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి గురువారం విశాఖలో అడుగుపెట్టిన సిఐటియు కార్మిక చైతన్య యాత్రకు నగరంలోని వివిధ రంగాలకు చెందిన సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల నుంచి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జరిగిన బహిరంగ సభలో సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ, ఒకప్పుడు 7వేల మంది పనిచేసిన షిప్‌యార్డులో నేడు 700 మందే మిగిలారని, భెల్‌లో 5వేల మంది ఉంటే నేడు 500 మందికి కుదించబడ్డారని, స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేయాలని కేంద్రం నిర్ణయించిందని, దీనిపై కార్మికవర్గం, ప్రజానీకం రెండేళ్లుగా పోరాడుతున్నారని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో కార్మిక సమస్యలపై ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడే సత్తా సిఐటియుక ఉందన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు ఆ సమర్థత లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి కార్పొరేట్లకు దాసోహం అవుతూ రూ.25వేల కోట్లతో నిర్మించిన జెన్‌కో ఆధునిక విద్యుత్‌ ప్లాంట్లను అదానీకి కట్టబెట్టడానికి కేబినెట్‌ తీర్మానించడం దారుణమన్నారు. రైళ్లనీ ప్రయివేటు చేయబోతున్నారని, ఇదే జరిగితే ఇప్పుడున్న ఛార్జీలకు 3 రెట్లు పెరగనున్నాయని ఆందోళన చెందారు. తర్వాత పాసింజరు రైళ్లూ ఉండవన్నారు. సమస్యలపై కార్మికులు, ప్రజలు ఆలోచించకుండా రాష్ట్రంలోనూ, దేశంలోనూ కుల, మతాల చిచ్చు రగిల్చే కుట్ర వ్యూహాలను బిజెపి చేస్తోందన్నారు. దీన్ని ఎంత త్వరగా కార్మికవర్గం గుర్తిస్తే దేశానికి అంత మేలు అని పేర్కొన్నారు. చిట్టివలస జ్యూట్‌ మిల్లును గత మంత్రి గంటా శ్రీనివాసరావు అమ్మేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు బేబీరాణి మాట్లాడుతూ భీమవరంలో 2023 జనవరి 2 ఉంచి 4 వరకూ జరుగనున్న సిఐటియు రాష్ట్ర మహాసభలు భవిష్యత్తు పోరాటాలకు నాందీ కానున్నాయన్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్‌ అధికారం చేపట్టాక నెమ్మదిగా వీరిని తొలగించే పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఐద్వా విశాఖ నాయకులు సత్యవతి మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమంలో ఐద్వా ఆధ్వర్యాన పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటున్నారని తెలిపారు. సిఐటియు శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, విజయనగరం జిల్లా కార్యదర్శి సురేష్‌ ప్రసంగించారు.