ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీదేవి
ప్రజాశక్తి-జగ్గయ్యపేట
పట్టణంలోని డివిఆర్ నగర్ లో సుందరయ్య భవన్ నందు సిఐటియు, ఐద్వా, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, ఆశ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సు ఐద్వా మండల కార్యదర్శి దంతాల రాజేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీదేవి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 1910వ సంవత్సరంలో అమెరికాలో మహిళలు పని ప్రదేశాలలో చాలా దుర్మార్గ పరిస్థితులు ఎదుర్కొన్నారని, ఆ పరిస్థితులపై మహిళలు పోరాట ఫలితంగా వారి హక్కులు సాధించుకున్నారని అప్పటినుండి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారన్నారు. మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అయినప్పటికీ నేడు మహిళలు వివక్షతకు గురవుతున్నారు అన్నారు. బిజెపి పాలిత ప్రాంతంలో నేడు మహిళలపై, చిన్న పిల్లలపై మానభంగాలు, హత్యలు జరుగుతున్నప్పటికీ కేసులు లేకుండా వారికి శిక్షలు పడకుండా చేయడం దుర్మార్గమన్నారు. కులం, మతం పేరుతో మహిళలపై దాడులు జరుగుతున్నాయని, ఇటీవల కాలంలో ఒక బిజెపి ఎంపీ సతీసహగమును మళ్ళీ పెట్టాలని అనడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. నేడు బిజెపి ఫ్యూడల్ భావజాలంతో పరిపాలిస్తుందని, కోట్ల రూపాయలు పేదల వద్ద కొల్లగొట్టి బడా పారిశ్రామిక వ్యక్తులకు పెడుతుందన్నారు. మహిళల హక్కులను పోరాట ఫలితంగానే సాధించుకున్నా మన్నారు. నేడు మహిళలను ఓటు బ్యాంకుగా పాలకులు వాడుకుంటున్నారని, ఈ విధానాలను తిప్పి కొట్టాలన్నారు. రాబోయే కాలంలో మహిళల హక్కులు సాధించుకొనుటకు మహిళలందరూ ఐక్యంగా పోరాటం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె కముల, ఐద్వా నాయకురాలు సోమోజు నాగమణి, రైతు సంఘం నాయకులు కె లింగారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కోట కష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాజు, ప్రత్యూష, ఆశ వర్కర్లు సుధారాణి, వెంకటరమణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎలకమ్మ, రంగమ్మ, సిఐటియు మండల అధ్యక్షులు షేక్ గౌస్ మియా, ఎస్ రామనాథం, మహిళలు పాల్గొన్నారు.










