Apr 18,2021 15:05

అవును.. అతను చాలా ఘాతుకం చేశాడు. పచ్చి మోసం.., ప్రేమ నాటకం నడిపి, తన హృదయంలో కోరికలను, ఆశల హరివిల్లును నిద్రలేపి, నిప్పు రగిల్చాడు. ప్రేమ సాక్షిగా ఒట్టుపెట్టి, రంగుల కలల సౌధం మీద అబద్ధపు తాజ్‌మహల్‌ కట్టాడు. ఎంత ప్రేమ..?
ప్రేమ అనే భావన సముద్రం వలె లోతైనది. ప్రేమ ఒక రాగరంజిత రసానుబంధం. తను దినేష్‌ని ఎంతగానో ప్రేమిస్తుంది. కానీ ప్రేమ పేరుతో బలిచేశాడు. ఇంతగా అతన్ని ఆరాధిస్తున్నప్పటికీ తను దినేష్‌ నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోయింది. దెబ్బ తగలకముందే ఆ రాయిని ఆపలేకపోయింది. ఈ దెబ్బ తన జీవితంలో ఆఖరిది మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఇక ఇంతకంటే భరించలేని బాధ ఇంకొకటి ఉంటుందా?
అమ్మ మొదటి నుంచి చెబుతూనే ఉండేది. కానీ ఆమె మాటలు ఎప్పుడూ లెక్కపెట్టింది గనుక..? ఎప్పుడూ ''దినేష్‌ దినేష్‌'' అంటూ రంగుల కలలో ఊపిరాడనంతగా ఉక్కిరిబిక్కిరవుతూ ఉండేది. అతని మధురమైన నవ్వు చూసి, తన హృదయం మీద ఒక మాయా వల కమ్ముకుంది. పక్షికి స్వేచ్ఛ అనేది పంజరంలో నుండి బయటకు వచ్చినప్పుడు వస్తుంది. కానీ మధురమైన ఆ నవ్వుల మత్తులో నుంచి తను బయటకు వచ్చినప్పటికీ అస్వతంత్రురాలై, ఆ జ్ఞాపకాల నీడలు నిస్సహాయురాలిని చేస్తూ తనను వెంటాడుతూ ఉన్నాయి.
దివిజ ఏమీ చేయలేకపోతుంది. ఎవ్వరికీ చెప్పలేకపోతోంది. ఇప్పటికీ ప్రతిక్షణం అతని గురించిన ఆలోచనలే అనుక్షణం వెంటాడుతున్నాయి. తన ప్రతి ఆలోచనలోనూ, ప్రతి జ్ఞాపకం వెనకాల ఆ వ్యక్తి మోము మాత్రమే మొదటి జ్ఞాపకంగా మిగిలింది. ఒకవేళ దినేష్‌ మాయలో ఇంతగా మునిగిందని అమ్మకు ముందుగా తెలిసినట్లయితే ఓ చక్కని పరిష్కారం చూపేదేమో? దివిజ హృదయం కల్లోల కడలిలా అతలాకుతలం అవుతోంది.
''అమ్మా... మొదటి కలయికలోనే అతని గురించి ఆలోచించాను. అతడు అందగాడే కాదు. ప్రత్యేకమైన వ్యక్తి, నువ్వు ఒకటి, రెండుసార్లు అతన్ని కలువు. అప్పుడు నువ్వే నిర్ణయిస్తావు తను నాకు సరిపోతాడా? లేదా?'' అని చెప్పింది.
అమ్మకి బహుశా తన హృదయం గాయపరచడం ఇష్టం లేదనుకుంటా? ఆమె సైకియాట్రిస్ట్‌ కూడా అవడంతో ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు అమ్మకు ఎలా చెప్పగలను? దివిజ దినేష్‌ బిడ్డకు తల్లి కాబోతోందని, దినేష్‌ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. దివిజ కళ్ళనిండా అంతులేని ధారలు. దినేష్‌ మాయలోపడి మొదటి నుంచీ ఉన్న తన ప్రాణమిత్రుల్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ఈ దు:ఖాన్ని పంచుకోవడానికి ఎవరూ లేరు. కేవలం గుండెల నిండా ఆవేదనే, చివరికి దివిజకు తన నీడ మాత్రమే తోడైంది.
తను ఆ రోజు చెప్పలేదా..? ''నీ కోసం అమ్మ, నాన్నని, ఆస్తిపాస్తులను కూడా లెక్కజేయక అన్నీ వదలి, కేవలం నీ కోసమే వచ్చేశా!'' అని. అతని మాటల్లో ప్రేమ ఒక వెల్లువలా ప్రవహించింది. అమృతవర్షం కురిసినట్లయ్యింది. నాకు తన ఆస్తి మీద, సిరి సంపదల మీద అధికారం వద్దు. కేవలం తన ప్రేమమీద హక్కు కావాలి, ఇవ్వగలడని ఆ రోజు అతని నులివెచ్చని కౌగిలి వేడిలో నాకు అనిపించింది. కేవలం ప్రేమ మీద అధికారమే కాదు.. తన ప్రాణం మీద అధికారం కూడా నాకే ఇవ్వగలడని... నేను ఏదనుకున్నానో అదే నిజమయేట్లుగా అన్నాడు.
''నా ప్రేమతో పాటు, నా ప్రాణంపైనా అధికారం నీదే'' అని.. ఆ సమయంలో దినేష్‌ మాటల్లో అనూహ్యంగా ప్రతి ప్రశ్నకూ దివిజకు సమాధానం లభించింది. ఆ తెలియని ప్రేమ మాయలో పడి, ఆమె మురిసిపోయింది. ఈ ప్రపంచంలో తన కంటే గొప్ప అదృష్టవంతురాలు లేనే లేదని తెగ సంబరపడి పోయింది.
''నా సిరి, సంపద, ప్రాణం అన్నీ నువ్వే దివిజా! నువ్వే నా ప్రేమ మూర్తివి. నువ్వే నిజంగా స్వచ్ఛమైన మంచు శిల్పానివి'' అంటూ మాయ చేశాడు. కానీ, ఆ మాట నిజమయ్యేలా ఆ సూర్యుని వేడి ఒక్కసారిగా ఆ మంచు శిల్పంపై ఆగ్రహంగా పడ్డవేళ.. ఆ మంచు కరిగి, అసలైన ఆ రూపం కనిపించింది.
ఒకరోజు దినేష్‌తో - ''మీ అమ్మానాన్నలతో మన విషయం చెప్పడం చాలా అవసరం. ఇంకా ఆలస్యమైతే పరిస్థితి చావులా ఘోరమౌతుంది. ఎందుకంటే నేను పెళ్ళి కాకుండానే తల్లిని కాబోతున్నాను!'' అనగానే.. దినేష్‌ సంతోషంతో ఎగిరి గంతేసి, తనను అతని కౌగిలిలో బంధించి, ఇంటికి తీసుకుని వెళతాడనుకుంది.
కానీ అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. దినేష్‌ ఆశ్చర్యపోలేదు. కౌగిలిలోకీ తీసుకోలేదు. అతని కళ్ళల్లో రక్తం చిమ్ముతోంది.. దివిజ వైపు చూసి బిగ్గరగా నవ్వుతూ..''ఒకవేళ అమ్మానాన్నలతో మన విషయం చెప్పడం అవసరమైతే నేను ఇంకా నూట పదకొండు మంది గురించి చెప్పి, వాళ్ళనూ ఇంటికి తీసుకెళ్లాలి. ఏం చెప్పమంటావా?'' అన్నాడు.
దివిజ నివ్వెరపోయింది. దినేష్‌ మాటలతో దివిజ ఆశల మేడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయోమయంతో వెనక్కి పరిగెత్తినట్టయ్యింది. తనువంతా ఒక్కసారిగా తడిచిపోయింది. చెమటతో కాదు, కన్నీటి ధారలతో. అన్ని దారులూ ఒక్కసారిగా మూసుకుపోయి, దిక్కు తోచనట్లయ్యింది. ఒకే ఒకదారి మాత్రం ఆ సమయంలో కచ్చితంగా కనిపిస్తోంది. అదే ''చావు''. చావు రమ్మని పిలుస్తున్నట్లుగా ఉంది.
అతి వేగంగా పరిగెడుతోంది దివిజ. అలా అలుపెరుగని వేగంతో పరుగెడుతుండగా దూరం నుంచి రైలుబండి కూత ఆమె చెవుల్లో మారుమోగుతోంది. అది విని, సింహం వలె పరుగెత్తేంత శక్తి తన కాళ్ళకి వచ్చినట్లయింది.
అప్పుడు దివిజ రైలు పట్టాలకి చాలా దగ్గరగా వచ్చింది. ఒక కుంటివాడు అప్పుడే చేతికర్ర పట్టుకుని ఎదురుగా, దగ్గరగా రైలు పట్టాలు దాటుతున్నాడు. కుంటివాడు కదా! త్వరత్వరగా పట్టాలు దాటలేడు. దాటించమని ఆమె మనసు చెబుతోంది. అదే జరిగింది. పట్టాలు దాటే ప్రయత్నంలో కుంటివాడి కర్ర విరిగిపోయింది. అతను కింద పడిపోయాడు. వెంటనే అతని వైపు పరిగెత్తింది. త్వర త్వరగా అతణ్ణి పైకి లేపుతూ ''దెబ్బ తగలలేదు కదా?'' అంటూ భుజాన్ని నిమురుతూ అడిగింది. ''కాస్త జాగ్రత్తగా తమాయించుకోండి బాబా!'' అంది.
ఆ కుంటివాని ముఖాన చిరుదరహాసం కనిపించింది. దివిజతో అతను ఇలా అన్నాడు. ''చేతికర్ర అనేది పడిపోకుండా అడ్డుకోడానికే బిడ్డా! కానీ విరిగిపోయిన తర్వాత కూడా తట్టుకుని, నిలబడటమే జీవితం!'' అంటూ ముందుకు సాగిపోయాడు అవిటివాడు.
ఇంతలో ధన ధన... శబ్ధం చాతీ దగ్గరికి వచ్చింది. కనురెప్పపాటు సమయంలో రైలు నుంచి పక్కకు తప్పుకుంది. ఇప్పుడు ఆమె మనసులో ఒకే ఒక్కమాట, మాటి మాటికీ ప్రతిధ్వనిస్తోంది. 'విరిగిన తర్వాతా, తట్టుకుని నిలబడటమే జీవితం' అని అర్థమయ్యింది.
''అవును నిజం!'' ఎందుకంటే నూటపదకొండు సార్లు మోసం చేసిన వాడికి తిరిగి బతకడానికి హక్కు ఉన్నప్పుడు.. కేవలం ఒక్కసారి, ఒకే ఒక్కసారి మోసపోయిన తనకు జీవించే హక్కు లేదా..? విరిగినా తట్టుకుని, జీవించగల ధైర్యాన్ని నేర్చుకుంటుంది తను. ఇది ముమ్మాటికీ అక్షర సత్యం. ''అవును..''
 

ఈతకోట సుబ్బారావు
9440529785