Jul 29,2023 23:00

ప్రజాశక్తి-కాకినాడ దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న హింసపై మహిళల పోరు యాత్ర జయప్రదం చేయాలని పలువురు పిలుపు ఇచ్చారు. శనివారం ఐద్వా నగర కమిటీ ఆధ్వర్యాన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐద్వా అధ్యక్ష కార్యదర్శులు భూలక్ష్మి, కె.నాగజ్యోతి మాట్లాడుతూ ఈ పోరు యాత్ర విశాఖపట్నం, హిందూపురం నుండి ఈ నెల 28న బయలు దేరిందని, ఆగస్టు 8న విజయవాడ చేరుకుంటుందని తెలిపారు. ఈ యాత్ర తుని, పిఠాపురం మీదుగా ఆగస్టు 1న కాకినాడ చేరుతుందన్నారు. ఆ రోజు మహిళలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అత్యాచారాలు, హింస జరిగిన తర్వాత బాధపడే కంటే, హింస జరగకుండా అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. హింసను ప్రేరేపించే మద్యం నిషేధించాలని, మాదకద్రవ్యాలు అరికట్టాలని మహళా సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అమానుష సంఘటనలను అరికట్టాలని, దోషులను తక్షణమే శిక్షించాలని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు భవాని, కుమారి పాల్గొన్నారు.