
ఐద్వా జిల్లా అధ్యక్షులు మాణిక్యం
ప్రజాశక్తి-రాంబిల్లి
దేశంలో మహిళలపై జరుగుతున్న హింస, దాడులు, హత్యలు, అత్యాచారాలపై పోరాటాలను ఉధృతం చేస్తామని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా అధ్యక్షులు పి.మాణిక్యం అన్నారు. మండలంలో రాంబిల్లి, పెదకళవలాపల్లి గ్రామాలలో ఆదివావారం హింసపై మహిళల పోరుయాత్ర కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈపోరు యాత్ర జూలై 28 నుండి ఆగష్టు 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ చిన్నారులు, మహిళలపై హింస రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుందని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇది మరింత పెరిగిందని విమర్శించారు. ప్రభుత్వాలు మహిళలు పట్ల నిర్లక్ష్యధోరణితో ఉన్నాయన్నారు. మహిళా మల్ల యోధులు ఢిల్లీలో చేసిన ఆందోళన తడి ఆరకముందే మణిపూర్‌లో కుకీ ఆడపడుచులపై అకృత్యాలు జరిగాయని పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం మహిళల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తుందన్నారు. పోరుయాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 8న విజయవాడలో జింఖానా గ్రౌండ్స్‌లో జరుగు బహిరంగ సభకు మహిళలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల నాయకులు జి.లక్ష్మి, ఎం.దేవి, రాజేశ్వరి, మాకరత్నం, పార్వతి పాల్గొన్నారు.