ప్రజాశక్తి-ఆలూరు
మహిళలపై హింసను అరికట్టాల్సిన ప్రభుత్వాలు హింసను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నాయని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి విమర్శించారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని ఐద్వా ఆధ్వర్యంలో జులై 28న శ్రీకాకుళంలో ప్రారంభమైన పోరుయాత్ర శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు మండలానికి చేరుకుంది. ఈ పోరుయాత్రకు ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, సిఐటియు, పంచాయతీ కార్మికులు సంఘీభావం తెలుపుతూ స్వాగతం పలికారు. ముందుగా అంబేద్కర్ సర్కిల్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎపి మోడల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభకు ఐద్వా మండల కార్యదర్శి షేకున్‌బీ అధ్యక్షత వహించారు. యాత్ర ముందు భాగాన కళాకారులు కళా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సభనుద్దేశించి రమాదేవి మాట్లాడారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ మహిళలపై హింసాకాండ రోజురోజుకు పెరుగుతోందని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు సైతం మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యాన్ని నిషేధించి మహిళల కళ్లలో ఆనందాన్ని నింపుతామని అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని తెలిపారు. నేడు మద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పాలన సాగించడం వల్ల మహిళలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మహిళలపై జరుగుతున్న హింసాకాండకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొనాలని కోరారు. ఆగస్టు 8న పోరుయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు వేలాదిమంది మహిళలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. గర్ల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సుజాత, ఐద్వా రాష్ట్ర సహాయ ఉపాధ్యక్షులు అలివేలమ్మ, సావిత్రి, జిల్లా అధ్యక్షులు అరుణ, గౌరవాధ్యక్షులు ధనలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు పద్మ, కోశాధికారి పిఎస్.సుజాత, మండల అధ్యక్షులు రత్నమ్మ, గౌసియాబీ, రాధమ్మ, సిఐటియు నాయకులు కెపి.నారాయణస్వామి, షాకీర్, డివైఎఫ్‌ఐ నాయకులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గిరి మూర్తి, ఉమేష్ పాల్గొన్నారు. దేవనకొండకు పోరుయాత్ర చేరుకుంది. స్థానిక కస్తూర్బా పాఠశాలలో ఏర్పాటు చేసిన సదస్సులో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి, రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి మాట్లాడారు. ఐద్వా జిల్లా కార్యదర్శి ఎన్.అలివేలు అధ్యక్షత వహించారు. ఐద్వా నాయకులు అరుణ, ధనలక్ష్మి, పిఎస్.సుజాత, కెఎస్.పద్మ, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ సునీత, సిబ్బంది, శ్రామిక మహిళా సంఘం మండల నాయకులు జ్యోతి, వనిత, కవిత, లక్ష్మీనరసమ్మ, హుస్సేనమ్మ, విద్యార్థి సంఘం మాజీ నాయకులు సురేంద్ర, ప్రవీణ్ కుమార్, సిఐటియు మండల కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి










