Nov 30,2022 00:01

ప్రతిజ్ఞ చేస్తున్న సామ్రాజ్యం, అరుణ, తరుణ్‌ తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి
మహిళలపై హింస లేని సమాజాన్ని నిర్మిద్దామని, సమానత్వ సాధనకై పయనిద్దామని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్‌.అరుణ అన్నారు. స్థానిక ఎఎంఎఎల్‌ కళాశాలలో మంగళవారం అంతర్జాతీయ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హింస, అత్యాచారాలు పెరగడానికి మద్యం, మత్తు పదార్థాలు ప్రధాన కారణమని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు తరుణ్‌ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఆడ మగ తేడా లేకుండా సమానంగా పెంచాలన్నారు. మహిళలు ఆత్మ రక్షణపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ సెల్‌ కో-ఆర్డినేటర్‌ జె.సామ్రాజ్యం మాట్లాడుతూ పాఠ్యపుస్తకాల్లో సమానత్వ భావాలను పెంపొందించే అంశాలను చేర్చాలన్నారు. ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి సుభాషిణి మాట్లాడుతూ మహిళలను కించపరిచి ప్రసంగించిన రాందేవ్‌ బాబా, గరికపాటిను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు జి తనూజ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళలపై హింసను అరికట్టాలి
పరవాడ : మహిళల మీద హింసను అరికట్టాలని ఐద్వా జిల్లా అధ్యక్షులు పి.మాణిక్యం అన్నారు. పరవాడ బాలికల కాలేజీలో ప్రిన్సిపల్‌ ఎన్‌.లలిత కుమారి ఆధ్వర్యంలో 90 మంది పిల్లలతో మంగళవారం సదస్సు నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందు ఉన్నా, అత్యాచారాలు వరకట్న వేధింపులు, బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు లీల, రేవతి, లక్ష్మీ, రోహిణి తదితరులు పాల్గొన్నారు
మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు అరికట్టాలి : కలెక్టర్‌ రవి
ప్రజాశక్తి- అనకాపల్లి
మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలు, దాడులను అరికట్టాలని కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయిలో అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలన్నారు. మహిళలు, బాలల సంరక్షణకు ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి డిసెంబర్‌ 10 వరకు జరుగుతున్న అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం మహిళలు బాలల సంరక్షణకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెసి కల్పనా కుమారి, డిఆర్‌ఓ వెంకటరమణ, డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ లక్ష్మీపతి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.