Aug 11,2023 20:57

అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న రైల్వే సిఐ, తదితరులు

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పట్టణంలోని రైల్వే స్టేషన్‌ లో గురువారం రాత్రి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఈ కేసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశామని రైల్వే సిఐ నాగరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన రౖల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంజాయి స్వాధీనం వివరాలను వెల్లడించారు. బెంగళూరులోని బెలేహా హల్లి కి చెందిన వరుణ్‌ కుమార్‌ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొని వచ్చి మరో ఇద్దరితో కలిసి వ్యాపారం చేస్తున్నాడు. ఈ మేరకు 10 కేజీల గంజాయిని ప్రశాంతి ఎక్స్‌ ప్రెస్‌ లో ఇచ్చాపురం నుంచి బెంగళూరు సిటీకి తీసుకు వెళుతున్నారు. సిటీలో పోలీస్‌ చెకప్‌ ఎక్కువ ఉందన్న సమాచారంతో గంజాయి తీసుకు వస్తున్న వరుణ్‌ కుమార్‌ హిందూపురం రైల్వే స్టేషన్‌లో దిగాడు. సాయంత్రం వరకు బయట కాలుక్షేపం చేసుకొని రాత్రికి బెంగళూరు వెళ్లడానికి కుర్ల ఎక్స్‌ ప్రెస్‌ రైలు ఎక్కడానికి 3వ నెంబర్‌ ప్లాట్‌ఫారమ్‌ వద్దకు వచ్చాడు. అనుమానస్పదంగా ఉన్న వరుణ్‌ను రైల్వే పోలీసులు గమనించి సోదాలు చేశారు. దీంతో వారు రెండు బ్యాగుల్లో ఉన్న గంజాయి గమనించారు. వరుణ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే ఇతనితో పాటు గణేష్‌, మరో వ్యక్తి కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. దీంతో హిందూపురం తహశీల్దార్‌ సమక్షంలో విచారణ చేసి ప్రధాన నిందితుడు వరుణ్‌ కుమార్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి, గుంతకల్లు రైల్వే కోర్టులో హాజరు పరుస్తున్నట్లు రైల్వే సిఐ నాగరాజు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన రైల్వే ఎస్‌ఐ బాలాజీ నాయక్‌, ఆర్‌పిఎఫ్‌ ఎస్‌ఐ కెంపరాజులతో పాటు సిబ్బందిని సిఐ అభినందించారు.