Feb 15,2022 06:57

భూస్వామ్య వ్యవస్ధను బద్దలుకొట్టేందుకు ఉద్దేశించిన భూసంస్కరణల చట్టాన్ని రివర్సు చేస్తూ భూకేంద్రీకరణను ప్రోత్సహిస్తున్నది. ఇది వ్యవసాయ రంగం పైన, రైతులపైన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే ప్రభుత్వ భూములను ఎంతోకాలంగా సాగు చేసుకుంటున్న పేద రైతులను వాటి నుండి వెళ్లగొట్టేలా మరో సవరణ తీసుకొచ్చింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని రవాణా సంస్ధ నాలుగు కార్పొరేషన్లుగా విస్తరించి వుంది. వేలాది ఎకరాల ఆస్తులను కలిగివున్న ఈ రవాణా సంస్ధను మానిటైజేషన్‌లో భాగంగా ముక్కలు ముక్కలు చేసి ప్రైవేటీకరించేందుకు బిజెపి ప్రభుత్వం పథక రచన చేస్తున్నది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు హిజాబ్‌ వంటి అనవసరమైన అంశాలపై బిజెపి రాద్ధాంతం చేస్తున్నది.


   హిజాబ్‌ను ఆసరాగా చేసుకుని విద్యార్థుల్లో విష బీజాలు నాటేందుకు కర్ణాటకలో మతతత్వ శక్తులు పన్నుతున్న పన్నాగాలు అభ్యుదయ, ప్రగతిశీల శక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. హిజాబ్‌, కాషాయ కండువాలు ధరించొద్దంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు పలు విమర్శలకు దారితీశాయి. కోర్టులో అప్పీలు చేసిన మేనేజ్‌మెంట్‌ కమిటీలు, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీలు ఉన్న కాలేజీలు, విద్యా సంస్థలకు మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు చెప్పింది. హైకోర్టు ఉత్తర్వులను పలువురు న్యాయ నిపుణులు ఆక్షేపించారు. స్టేటస్‌కో (యథాతథ స్థితి)ను కొనసాగించాలనుకుంటే వివాదం షురూ కాకముందున్న స్థితిని కొనసాగించాలి. అంతేకానీ వివాదం తలెత్తాక ఏర్పడిన స్థితిని కొనసాగించాలనడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుపై సోమవారం తిరిగి విచారణను చేపట్టిన హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. మరో వైపు ప్రీ యూనివర్సిటీ స్థాయి (11, 12 తరగతుల) కళాశాలలను ఈ నెల 15 వరకు, డిగ్రీ కాలేజీలను 16 వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్వేషాలను రెచ్చగొట్టి విద్యార్థుల మధ్య చీలిక తెచ్చే ఈ నీచ సంస్కృతిని మతతత్వ శక్తులు ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపింపజేసేందుకు యత్నిస్తున్నాయి. బెంగళూరు ఇన్‌స్టిట్యూషన్‌లో ఓ టీచర్‌ని మేనేజ్‌మెంట్‌ బోర్డు ఈ కారణంగానే సస్పెండ్‌ చేసింది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ వేర్వేరు రూపాల్లో ఈ ధోరణులు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం, ఆరెస్సెస్‌, బజరంగ్‌దళ్‌ కూడబలుక్కుని విద్యార్థుల మధ్య మతపరమైన చీలికను మరింత పెంచాలని చూస్తున్నాయి. సాధారణ ఘటనలకు కూడా మతం రంగు పులిమేందుకు యత్నిస్తున్నాయి. ఇంకో వైపు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పిఎఫ్‌ఐ), కేంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (సిఎఫ్‌ఐ) వంటి ముస్లిం మత ఛాందసవాద గ్రూపులు ఈ వివాదాన్ని ఉపయోగించుకుని ముస్లిం విద్యార్థులనందరినీ సంఘటితం చేయాలని చూస్తున్నాయి. మామూలుగా మత ఛాందసవాదానికి దూరంగా ఉండే ముస్లిం విద్యార్థులను సైతం తమ వైపు తిప్పుకునేందుకు ఈ శక్తులు దీనినొక అవకాశంగా తీసుకుంటున్నాయి. విద్యార్థుల్లో ఈ విధమైన విభజన తీసుకురావడం దేశ సమైక్యత, సమగ్రతకు ముప్పు అన్న భావన సాధారణ ప్రజానీకంలో ఉంది.
 

                                                            ఎందుకీ వివాదం ?

ఉడిపి ప్రభుత్వ పియుసి కళాశాలలో మొదలైన ఈ వివాదానికి సంబంధించి విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాలేజీ టీచర్‌ దగ్గర నుంచే వివాదం మొదలైందనేది ఒక వాదన. పిఎఫ్‌ఐ జోక్యంతో ఇదొక కొత్త మలుపు తీసుకుందని, కాలేజీలో కొత్తగా ఈ ప్రాక్టీసు (హిజాబ్‌ ధరించడం) ప్రారంభించడానికి ఇదే కారణమనేది కొందరి వాదన. హిజాబ్‌ ధరించడం అక్కడ ఎప్పటి నుండో వుందని, ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదనేది మరో వాదన. పిఎఫ్‌ఐ వాళ్ల వల్లే సమస్య తలెత్తిందనేది ఇంకొక వాదన. ఏదేమైనప్పటికీ ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఉడిపి నుండి కుందాపుర తాలూకా సెంటర్‌ లోని ప్రభుత్వ పి.యు కాలేజి, బండార్కర్‌ కాలేజి (ఎయిడెడ్‌)కి పాకింది. హిజాబ్‌ వేసుకోవడం ఈ రెండు కాలేజీల్లో మొదటి నుంచి వుంది. ఇప్పుడు హిజాబ్‌ ధరించకూడదనడంతో ఇక్కడ వివాదం మొదలైంది. ఈ ప్రాంతంలో ఎంఎల్‌ఎలు, మంత్రులు, స్థానిక సంస్థల ప్రతినిధులు అంతా బిజెపి కి చెందినవారే. ఈ అనవసర వివాదాన్ని రెచ్చగొట్టడంలో వీరే కీలకపాత్ర పోషించారు. కాషాయ కండువాలు పెద్దఎత్తున తెప్పించి బస్సు దిగగానే విద్యార్థులకు వాటిని ఇవ్వడం, హిజాబ్‌కు వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టడం వంటివి వారు బహిరంగంగానే చేపట్టారు. వివాదం ప్రారంభంలో ముప్పై, నలభైమంది విద్యార్థులే ఈ ఆందోళనలో ఉన్నారు. మీడియా దీనిపై పెద్దయెత్తున ఊదరగొట్టడం, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు వెరసి సమస్యను మరింత జటిలం చేశాయి. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్వేష మూకలు ఒకవైపు, పిఎఫ్‌ఐ, సిఎఫ్‌ఐ మరొకవైపు ఉంటూ విద్యార్థులను రెచ్చగొట్టే యత్నం చేశాయి. కొందరు బిజెపి ఎంపీలు, ఎంఎల్‌ఎలు, మంత్రులు హిజాబ్‌ ధరించాలనుకునేవారు మదరసాలకు, లేదంటే పాకిస్తాన్‌కు పొండి అంటూ విషంగక్కారు. సమానత్వం అన్న భావనపై గందరగోళం సృష్టించారు. హిజాబ్‌ను ధరించడం యూనిఫామ్‌కు విరుద్ధం అన్నట్లుగా గోడీ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే దీన్ని వ్యతిరేకించేవారు కూడా గణనీయంగానే ఉన్నారు. ముస్లిం బాలికలు చదువుకోడమే తక్కువ. వారిని ప్రోత్సహించాలే కానీ ఇలా ఇబ్బందిపెట్టడం మంచిది కాదనే అభిప్రాయం హిందువుల్లోనూ ఉంది.
 

                                           ప్రజల అసంతృప్తిని పక్కదారి పట్టించే యత్నం

రెండు ముఖ్యమైన ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది బిజెపి, ఆరెస్సెస్‌ పన్నాగంలో భాగం. ఏడాది క్రితం జరగాల్సిన జిల్లా పరిషత్‌, తాలూకా పంచాయతీ ఎన్నికలు రిజర్వేషన్లు, డీ లిమిటేషన్లు వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ ఏప్రిల్‌, మేలో వీటికి ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు బెంగుళూరు నగరపాలక సంస్థకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. బెంగుళూరు నగరపాలిక పరిధిలో 28 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండటంతో ఇది బిజెపి కి చాలా కీలకంగా మారింది. కేంద్రంలోను, రాష్ట్రంలోను బిజెపి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ముదనష్టపు విధానాలు, వాటి దుష్ట పాలనపై ప్రజల్లో అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది.
    బిజెపిపై అంతగా వ్యతిరేకత పెరగటానికి వ్యవసాయ రంగం పట్ల ఇంతకుముందు ఎడియూరప్ప, ఇప్పుడు బసవరాజు బొమ్మై ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశకర విధానాలే ఒక ముఖ్య కారణమని చెప్పాలి. భూసంస్కరణల చట్టం-1974ను ఎడియూరప్ప ప్రభుత్వం దాదాపు నిర్వీర్యం చేసింది. ఆ చట్టానికి సవరణల పేరుతో కౌలుదార్ల హక్కులకు తూట్లు పొడిచింది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్పిడి చేసుకునేందుకు ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. కార్పొరేట్‌ కంపెనీలు రైతుల దగ్గర నుంచి నేరుగా భూములు కొనుగోలు చేసేందుకు అనుమతిస్తూ సవరణ తెచ్చింది. నలుగురైదుగురు సభ్యులున్న కుటుంబం గరిష్టంగా 54 ఎకరాల వరకు మెట్టభూమి కలిగి ఉండాలన్న ప్రస్తుత పరిమితిని 108 ఎకరాలకు పెంచేసింది. భూస్వామ్య వ్యవస్ధను బద్దలుకొట్టేందుకు ఉద్దేశించిన భూసంస్కరణల చట్టాన్ని రివర్సు చేస్తూ భూకేంద్రీకరణను ప్రోత్సహిస్తున్నది. ఇది వ్యవసాయ రంగం పైన, రైతులపైన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే ప్రభుత్వ భూములను ఎంతోకాలంగా సాగు చేసుకుంటున్న పేద రైతులను వాటి నుండి వెళ్లగొట్టేలా మరో సవరణ తీసుకొచ్చింది. ప్రస్తుతం 18 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు 13 లక్షల మంది రైతుల చేతిలో ఉన్నాయి. వీరంతా ఆ భూములకు న్యాయమైన హక్కుదార్లు. వీరికి ఉచితంగా వీటిని రిజిస్ట్రేషన్‌ చేయాల్సిన ప్రభుత్వం వాటిని లాగేసుకునేేందుకు యత్నిస్తున్నది. దీనికి వ్యతిరేకంగా సిపియం, ఇతర వామపక్షాలు, రైతుసంఘాలు, వ్యవసాయకార్మిక సంఘం, ఇతర సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు తీవ్రతరం అవుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని రవాణా సంస్ధ నాలుగు కార్పొరేషన్లుగా విస్తరించి వుంది. వేలాది ఎకరాల ఆస్తులను కలిగివున్న ఈ రవాణా సంస్ధను మానిటైజేషన్‌లో భాగంగా ముక్కలు ముక్కలు చేసి ప్రైవేటీకరించేందుకు బిజెపి ప్రభుత్వం పథక రచన చేస్తున్నది. కోవిడ్‌ను ఎదుర్కోవటంలో అది ఘోరంగా విఫలమయింది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు హిజాబ్‌ వంటి అనవసరమైన అంశాలపై బిజెపి రాద్ధాంతం చేస్తున్నది.
    అసలే అంతంతమాత్రంగా వున్న ముస్లిం బాలికల విద్యను అడ్డ్డుకోజూస్తున్నది. ముస్లిం మైనారిటీల విద్యను పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకునేందుకు యత్నిస్తున్నది. హిజాబ్‌ పై ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న విద్వేష మూకలను అదుపు చేయాల్సిందిపోయి వాటికి వత్తాసు పలుకుతున్న రాష్ట్ర హోం మంత్రి తక్షణమే ఆ పదవికి రాజీనామా చేయాలని సిపియం డిమాండ్‌ చేస్తోంది. ఈనెల 11,12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. పోలీసులు అనుమతి ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ పలు తాలూకా, జిల్లా కేంద్రాల్లో నిరసనలు విజయవంతం అయ్యాయి. ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడం కోసం బిజెపి యేతర, పిఎఫ్‌ఐ యేతర పార్టీలను, సంఘాలను, సంస్ధలను కలుపుకుని ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు కృషి జరుగుతున్నది.
 

( వ్యాసకర్త : సిపిఐ(ఎం) కర్ణాటక రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు )
కె. ప్రకాష్‌

కె. ప్రకాష్‌