
ప్రజాశక్తి-నక్కపల్లి:న్యాయమైన సమస్యలు పరిష్కారమయ్యే వరకు మత్స్యకారులు ఐక్యంగా పోరాటం కొనసాగించాలని సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రావణ్ కుమార్ అన్నారు. హెటిరో కంపెనీ వేస్తున్న మూడు అడుగుల పైప్ లైన్ పూర్తిగా తొలగించాలని, పైప్ లైన్ వేసుకోవడానికి అనుమతులు ఇవ్వరాదని 551 రోజులుగా మత్స్యకారులు చేపడుతున్న మహా శాంతియుత ధర్నా శిబిరాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిశ్రమతో మంచి జరుగుతుందనుకున్న మత్స్యకారులకు నష్టం జరగడం బాధా కరమన్నారు. దీంతో ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు ఉపాధి పోయి కుటుంబాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేరేచోటకు వలసలు పోవాల్సివస్తోందన్నారు.పరిశ్రమ వల్ల పడుతున్న బాధలను, పర్యావరణ అంశాలను రాతపూర్వకంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. సమస్య పరిష్కారం కోసం మత్స్యకారులంతా సమన్వయం చేసుకొని పోరాడుతూ తమ బతుకులను కాపాడుకోవాల న్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, నాయకులు పిక్కి కామేశ్వరరావు, పిక్కిగంగరాజు, మైలపల్లిమహేష్ బాబు, గోసల సోమేశ్వరరావు, చేపలు సోమేష్, మైలపల్లి భయ్యన్న, పిక్కి సత్తయ్య, వాసు పిల్లి స్వామి,వాసు పిల్లి నూకరాజు, చొక్కా కాశీ, కొండలరావు, స్వామి, మైలపల్లి బాపూజీ, మైలపల్లి శివాజీ, రమణ, కాశీ రావు, బొందలపు అప్పలరాజు, బొంది నూకరాజు పాల్గొన్నారు.