
ప్రజాశక్తి -నక్కపల్లి :హెటిరో రసాయన వ్యర్ధ జలాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదలడంతో మత్స్య సంపద నశించిపోతుందని, దీని కారణంగా జీవనోపాధిని కోల్పోతు న్నామని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పట్టన్ శెట్టి ఎదుట మత్స్యకారులు ఆవేదన వెలిబుచ్చారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ దొండవాక మీదుగా రాజయ్యపేట వెళుతుండగా మత్స్యకారులు చేపడుతున్న ఆందోళన శిబిరం వద్ద జిల్లా కలెక్టర్‌కు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు ఆధ్వర్యంలో మత్స్యకారులు వినతిపత్రం అందజేశారు. కంపెనీ కొత్తగా వేస్తున్న పైప్ లైన్‌కు వ్యతిరేకంగా 523 రోజుల నుండి తామంతా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. కంపెనీ వ్యర్థ రసాయన జలాలను పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి, శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదలడంతో చేపలు మృత్యువాత పడుతున్నాయని, దీంతో ఉపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వేట సాగకపోవడంతో వలసలు పోవడం జరుగుతుందన్నారు. కొత్తగా పైపులైన్ ఏర్పాటు చేస్తే తమ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని, ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితులు నెల కొంటాయని ఆవేదన వెలిబుచ్చారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు మాట్లాడుతూ, పైపులైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ ను ఆశ్రయించడం జరిగిందన్నారు. హెటిరో డ్రగ్స్ యాజమాన్యం న్యాయ స్థానాలకు, అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకుంటుందని విమర్శించారు. రాజయ్యపేట సర్వే నెంబర్ 291 లో 400 ఎకరాలు ఉప్పుటేరు ఉందని దీనిని పూడిక తీయించి నీరు నిల్వ ఉండేటట్టు గా చేస్తే వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఉప్పుటేరులో చేపలు పట్టుకుని జీవనోపాధి పొందే అవకాశం ఉంటుందన్నారు. ఉప్పుటేరులో పూడిక తీత పనులు చేయించాలని కోరారు. రాజయ్యపేట సముద్ర తీరంలో ఫిషింగ్ జెట్టి నిర్మించాలని, గ్రామం మొత్తంలో సగానికి పైగా ఫారెస్ట్ భూమి ఉందని, ఇళ్ళు నిర్మించుకోవాలంటే ఇంటి పట్టా ( ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్) ఇవ్వడం లేదని, దీని కారణంగా పేదలు ఇల్లు నిర్మించుకోలేక పోతున్నారని పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి గోసల కాసులమ్మ, మత్స్యకార నాయకులు పిక్కి కామేశ్వరరావు, పిక్కి సత్తయ్య, గోసల సోమేశ్వరరావు, వాసిపిల్లి నూకరాజు, పిక్కి గంగరాజు, మైలపల్లి మహేష్ బాబు, చేపలు సోమేష్, మైలపల్లి జాన్, వాసుపిల్లి శివ, తదితరలు పాల్గొన్నారు.