ప్రజాశక్తి-నక్కపల్లి:హెటిరో డ్రగ్స్ కంపెనీతో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలపై హైకోర్టును ఆశ్రయిద్దామని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. హెటిరో పైప్ లైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు తలపెట్టిన శాంతియుత మహా ధర్నా శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ ఆధ్వర్యంలో మత్స్యకార నాయకులు పిక్కి కామేశ్వరరావు, పిక్కి స్వామి, వాసిపిల్లి నూకరాజులతో పాటు పలువురు మత్స్యకారులు ఆయనకు హెటిరో కంపెనీ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పైప్ లైన్ కు వ్యతిరేకంగా 397 రోజుల నుండి ఆందోళన చేస్తుంటే అధికార యంత్రాంగం, ప్రభుత్వం పట్టించు కోలేదన్నారు. కంపెనీ వ్యర్ధ జలాలు శుద్ధి చేయకుండా సముద్రంలోకి, ఉప్పుటేరులోకి వదలడంతో మత్స్య సంపద నశించి మత్స్యకారులంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ కాలుష్యం కారణంగా క్యాన్సర్, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తదితర రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వెలిబుచ్చారు.క్యాన్సర్ బారిన పడి అనేకమంది మత్స్యకారులు మృత్యువాత పడ్డారని లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకు వెళ్లారు.అదేవిధంగా భూగర్భ జలాలు కూడా కాలుష్య బారిన పడ్డాయన్నారు. స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్న ప్పటికీ, హెటిరో కంపెనీలో అవేమీ పాటించ లేదన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పైప్ లైన్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు 397 రోజుల నుండి ఆందోళన చేస్తుంటే మత్స్యకారుల జీవితాలు సముద్రం పై ఎంతగా ఆధార పడ్డాయో అర్థమవు తుంద న్నారు. కంపెనీ వ్యర్ధ జలాలు సముద్రంలోకి వదిలే ముందు ఈ టిపి చేసి వదలాలన్నారు. వ్యర్థ జలాలు శుద్ధ చేసి వదులు తున్నారో లేదో అన్న విషయాన్ని పొల్యూషన్ శాఖ అధికారులు పరిశీలించి నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. కంపెనీత మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, దీన్ని ఎదుర్కొనేందుకు న్యాయపోరాటం చేద్దామన్నారు. కంపెనీ ఏర్పాటుకు ముందు నియమ నిబంధనలకు సంబంధించి ప్రభుత్వంతో తీసుకున్న అగ్రిమెంట్, సి ఎస్‌ఆర్ ఫండ్స్‌కు సంబంధించిన వివరాలు, స్థానికులకు కంపెనీ కల్పిస్తున్న ఉద్యోగాల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించాలన్నారు. వ్యర్థ జలాలు, మృతుల వివరాలు పూర్తిస్థాయిలో సేకరించి పూర్తి ఆధార పత్రాలను కోర్టుకు సమర్పించాలన్నారు. సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.మత్స్యకారులు చేపట్టిన ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న మత్స్యకారుడు గోసల స్వామిని లక్ష్మీనారాయణ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోసూరి శ్రీనివాస్, మత్స్యకార నాయకులు పిక్కి కోదండరావు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.










