ప్రజాశక్తి-నక్కపల్లి:పైప్‌లైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు 461వ రోజుల నుంచి ఆందోళన చేపడుతున్నా ఆ సమస్యలను పరిష్కరించకుండా విశాఖలో ఇటీవల జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం హెటిరో కంపెనీ విస్తరణకు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చు కోవడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు విమర్శించారు.పైప్ లైన్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు తలపెట్టిన శాంతియుత మహా ధర్నా 461వ రోజుకు చేరింది. బుధవారం ధర్నాలో అప్పలరాజు పాల్గొని మాట్లాడారు. 2006లో రూ.5,200 కోట్ల పెట్టుబడులతో 500 ఎకరాల్లో హెటిరో డ్రగ్స్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆనాటి నుండి నేటి వరకు కంపెనీ యాజమాన్యం చట్టాలను ఉల్లంఘించి, కంపెనీ చుట్టూ ఉన్న భూములను ఆక్రమించి, పర్యావరణానికి నష్టం కలిగించే విధంగా కంపెనీ నడుపుతున్నారన్నారు.కంపెనీ నుండి వెలువడే రసాయన కాలుష్యంతో ఆ ప్రాంతంలో గాలి, నీరు, భూగర్భ జలాలు కలుషితం కావడంతో ప్రజలు అనేక రోగాలను బారిన పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే అనేకమంది మృత్యువాత పడటం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ వ్యర్థ రసాయన జలాలను సముద్రంలోకి వదలడంతో మత్స్య సంపద నశించి మత్స్యకారులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వెలిబుచ్చారు. ఈ ప్రాంతంలో వేట సాగకపోవడంతో మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలసలు పోవడం జరుగుతుందన్నారు. కంపెనీతో మత్స్యకారులకు ఇంత నష్టం జరుగుతుంటే విస్తరణకు ఎలా ఒప్పందం చేసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 15 సంవత్సరాల నుండి సిఆర్‌జెడ్ అనుమతి లేకుండా డీశాలినేషన్ ప్లాంట్ ద్వారా సముద్రపు నీటిని వినియోగిస్తున్నా, అనుమతులు లేకుండా పైప్ లైన్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పైప్ లైన్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం.రాజేష్, మత్య్సకార నాయకులు వాసుపల్లి నూకరాజు, గోసల సోమేశ్వరరావు, చేపలు సోమేష్, కోడా కాశీ, పిక్కి రమణ, పిక్కి రాజు, మైలపల్లి జాన్, మైలపల్లి నరేష్, మామిడి రమణ, బొంది బాబ్జీ, మైలపల్లి దార్రాజు, కొత్వాల్ కాశీ పాల్గొన్నారు.










