
ప్రజాశక్తి -నక్కపల్లి:హెటిరో మందుల కంపెనీ కొత్తగా వేస్తున్న పైపులైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు తలపెట్టిన శాంతియుత మహా ధర్నా శుక్రవారం 490వ రోజుకు చేరింది. శిబిరం వద్ద మత్స్యకారులు పైప్ లైన్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ, పైపులైన్‌కు వ్యతిరేకంగా 490 రోజుల నుండి తామంతా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం సమస్య పరిష్కారానికి మార్గం చూపక పోవడం దారుణమన్నారు. కంపెనీ వ్యర్ధ జలాలను ఇప్పటికే వేసిన పాత పైప్‌లైన్ ద్వారా సముద్రంలోకి వదలడంతో మత్స్య సంపద నశించి తామంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వేట సాగక పోవడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా పైప్ లైన్ ఏర్పాటు చేస్తే తమ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని ఆవేదన వెలిబుచ్చారు. మత్స్యకారుల జీవన విధానం దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా వేస్తున్న పైప్ లైన్‌కు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు గోసల స్వామి, పిక్కి రమణ, చేపల సోమేష్, బొంది నూకరాజు, దైలపల్లి వీర్రాజు, మైలపల్లి నల్ల, మైలపల్లి జాను, మైలపల్లి వెంకటేష్, వాసపల్లి వెంకటేష్, కారే కోదండ రావు తదితరులు పాల్గొన్నారు.