Nov 10,2022 23:56

ఆందోళన చేస్తున్న అప్పలరాజు. మత్స్యకారులు

ప్రజాశక్తి-నక్కపల్లి:హెటిరో పైప్‌లైన్‌కు ఎట్టి పరిస్థితు ల్లోనూ అనుమతులు ఇవ్వకూడదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో పైప్‌ లైన్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టిన శాంతియుత మహా ధర్నా గురువారం నాటికి 345వ రోజుకు చేరింది. మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు అప్పలరాజు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంపెనీ వ్యర్థ జలాలను సముద్రంలోకి, ఉప్పుటేరులోకి వదలడంతో మత్స్య సంపద నశించి పోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఉప్పుటేరులో టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడ్డాయన్నారు. ఈ ప్రాంతంలో చేపల వేట సాగకపోవడంతో చాలామంది మత్స్యకారులు పొట్ట చేతబట్టి ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీ కొత్తగా వేస్తున్న పైప్‌ లైన్‌కు భవిష్యత్తులో కూడా అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం.రాజేష్‌, మత్స్యకార నాయకులు పిక్కి గంగరాజు, గోసల స్వామి, మైలపల్లి మహేష్‌బాబు, కోడా కాశీ, చేపల రామకృష్ణ, కారే తాతాజీ, కొత్వాల్‌ కాశీ తదితరులు పాల్గొన్నారు.