Dec 01,2022 23:51

అభివాదం చేస్తున్న ప్రజా సంఘాలు, పలు పార్టీల నేతలు

ప్రజాశక్తి-నక్కపల్లి:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెటిరో పైపులైన్‌కు అనుమతి ఇవ్వొద్దని పలువురు నేతలు తెలిపారు. హెటిరో పైపులైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకార జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత మహా ధర్నా గురువారం నాటికి 365 రోజులకు చేరుకోవడంతో శిభిరం వద్ద సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసారు. మత్స్యకార జెఎసి రాష్ట్ర అధ్యక్షులు కంబాల అమ్మోరియ్య అధ్యక్షతన జరిగిన సభలో పలువురు అఖిలపక్ష పార్టీల నేతలు, మత్స్యకార నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జడ్‌పిటిసి సభ్యురాలు గోసల కాసులమ్మ మాట్లాడుతూ, పైపులైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకార యువత ముందుకు వచ్చి ఉధ్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడం అభినందనీయమన్నారు. సరైన నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో కూడా పైప్‌లైన్‌ ఏర్పాటుకు అనుమతులు రాకుండా పోరాటాన్ని కొనసాగించాలన్నారు.
తెలుగుదేశం పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మాట్లాడుతూ, కంపెనీ కాలుష్యం కారణంగా అనేకమంది మత్స్యకారులు అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు. పాత పైప్‌ లైన్‌ దెబ్బతినడంతో కొత్త పైపులైన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని, పాతది పాడైతే ఉత్పత్తి ఎందుకు నిలుపుదల చేయలేదని ప్రశ్నించారు. కొత్త పైప్‌ లైన్‌ అనుమతి కోసం కంపెనీ యాజమాన్యం ఢిల్లీ చుట్టూ తిరుగుతుందన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ, ఎటువంటి అనుమతులు లేకుండా పైపులైన్‌ ఏర్పాటు చేయడానికి కంపెనీ యాజమాన్యానికి అంత ధైర్యం ఎవరిచ్చారని ప్రశ్నించారు. హెటిరో కాలుష్య వర్ధ జలాలను సముద్రంలోకి వదలడంతో మత్స్య సంపద నశించి మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. పైపులైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదన్న ఉద్ధేశ్యంతో న్యాయ పోరాటం చేస్తున్నామని, చెన్నైలో జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో కేసు వేయడంతో వారు వివిధ విభాగాల్లో ముఖ్యమైన అధికారులతో అత్యున్నత కమిటిని నియమించారన్నారు. హెటిరో కంపెనీకి 6 కోట్ల 94లక్షలు ఫైన్‌ కూడా విధించడం జరిగిందన్నారు.
జాతీయ మత్సకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు మాట్లాడుతూ, ప్రభుత్వాలు తీర ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే ముందు తప్పనిసరిగా ఆయా గ్రామాల మత్స్యకారుల ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. జాయింట్‌ యాక్షన్‌ కమిటి ద్వారా ఉధ్యమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. రాజయ్యపేట పంచాయతీ సర్పంచ్‌ తనయుడు పిక్కి శ్రీనివాసరరావు మాట్లాడుతూ, కంపెనీ కొత్తగా వేస్తున్న పైపులైన్‌కు పంచాయతీ నుంచి ఎటువంటి తీర్మానం ఇవ్వలేదన్నారు. జనసేన నేత బోడపాటి శివదత్‌ మాట్లాడుతూ, మత్స్యకారులు తలపెట్టిన ఆందోళనకు తమ పూర్తి మద్దుత్తు ఉంటుందన్నారు.మత్స్యకారులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. మత్స్యకార నాయకులు గరికిన సింహాద్రి,ఉమ్మిడి గోవింద్‌, పిక్కి స్వామి, వాసిపిల్లి నూకరాజు తదితర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు పిక్కి కోదండ, గంగరాజు, గోసల స్వామి పాల్గొన్నారు.