Mar 30,2023 23:53

బాణాలు ఎక్కిపెట్టి నిరసన తెలుపుతున్న అప్పలరాజు ,మత్స్యకారులు

ప్రజాశక్తి-నక్కపల్లి:హెటిరో డ్రగ్స్‌ మందుల కంపెనీ కి రెండో అతి పెద్ద పైపులైను వేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. పైపులైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు తలపెట్టిన ధర్నా 482వ రోజుకు చేరింది. గురువారం శిబిరం వద్ద మత్స్యకారులు పైపులైన్‌కు వ్యతిరేకంగా బాణాలు ఎక్కుపెట్టి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పైపులైన్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, మత్య్సకారుల జీవనోపాధిని దెబ్బ తీస్తున్న హెటిరో డ్రగ్స్‌ మందుల కంపెనీపై మత్య్సకారులు ధర్మ పోరాటం చేస్తున్నారని, ఈ పోరాటంలో న్యాయం ఉందని అంతిమంగా ధర్మం, న్యాయం గెలిచి తీరుతుందన్నారు. మత్స్యకారులు 482 రోజుల నుండి పోరాటం చేస్తుంటే ఇదేమీ పట్టించుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పైపులను వేసుకోవడానికి అనుమతులు ఇచ్చారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మత్స్యకారులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పర్యావరణ చట్టాలను యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్న హెటిరో డ్రగ్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా మత్య్సకారుల జీవనోపాధికి తీవ్రంగా నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైపు లైన్‌ వేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులు రద్దు చేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు గోసల సోమేశ్వరరావు, చేపల సోమేష్‌, పిక్కి రమణ, బొంది నూకరాజు, మైలపల్లి శివాజీ, మైలపల్లి బాపూజీ, పిక్కి రాజు, మైలపల్లి వెంకటేష్‌, పిక్కి కాశీరావు, చోడిపల్లి రాజు పాల్గొన్నారు.