Nov 01,2022 23:41

భవనాల ప్రారంభంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలంలోని చందకలో ఉపాధి హామీ నిధులు రూ.17.50 లక్షలతో నిర్మించిన వెల్‌నెస్‌ విలేజ్‌ హెల్త్‌ సెంటర్‌ను, రూ.21 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, ఆనందపురం పంచాయతీలో రూ.25 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే మ్తుతంశెట్టి శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆనందపురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందించి గాంధీజీ కలల కన్నా స్వరాజ్యం జగనన్నతో సాధ్యమైందని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు తదితరాలను కల్పిస్తున్నారన్నారు. సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పాలనకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మజ్జి శరదా ప్రియాంక, జడ్‌పిటిసి కోరాడ వెంకట్రావు, వైసిపి నాయకులు కాకర్లపూడి శ్రీకాంత్‌రాజు, బంక సత్యనారాయణ, మజ్జి వెంకట్రావు, పాండ్రంకి శ్రీను, సర్పంచులు చందక లక్ష్మి సూరిబాబు, బంక శ్రీను, ఎంపిటిసిలు కొట్యాడ రమాదేవి బంటుబిల్లి అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.
పలు సమస్యలపై వినతులు
భవనాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు పలు సమస్యలతో కూడిన వినతాపత్రాలను గ్రామస్తులు అందజేశారు. ఆనందపురం పంచాయతీ దొంతల వారి కల్లాలకు రోడ్డు, మంచినీటి కుళాయిలు ఏర్పాటుచేయాలని దొంతల వెంకటనారాయణ, అనందపురం ఎన్‌టిఆర్‌ కాలనీలో లబ్ధిదారులకు 2016లో ఇచ్చిన ఇళ్ల స్థలాలకు మౌలిక వసతులు కల్పించాలని ఎంపిటిసి సభ్యులు కొట్టాడ రమాదేవి, ఆనందపురం గ్రామం నుంచి జట్లం కొండ చుట్టూ ఎంపిడిఒ కార్యాలయానికి రహదారి ఏర్పాటుచేయాలని షినగం రామారావు, శ్రమజీవులు కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను, ఇంటిపై ఉన్న విద్యుత్‌ వైర్లను మార్చాలని కంచిమాని ఎర్రయ్యతో పాటు గ్రామస్తులు, ఆనందపురం పంచాయతీలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని వైసిపి మండల యూత్‌ ప్రెసిడెంట్‌ సంత కప్పలస్వామి వినతిపత్రాలు అందించారు.